సాయంలో వివక్షా?

19 Oct, 2014 01:58 IST|Sakshi
సాయంలో వివక్షా?
  • 25కు బదులు 10 కిలోల బియ్యం పంపిణీపై ఆగ్రహం
  • అమలాపురంలో రేషన్‌డిపో ముందు బాధితుల ధర్నా
  • ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపణ
  • నక్కపల్లి/నక్కపల్లి రూరల్:  తుపాను సాయమందించడంలో ప్రభుత్వం వివక్ష పాటించడం తగదని, అందరికీ ఒకేలా బియ్యం పంపిణీ చేయాలని నక్కపల్లి మండలం అమలాపురంలో బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారు నిరసనకు దిగారు. గ్రామంలో సగం మందికి 25 కిలోల వంతున బియ్యం పంచి మిగతావారికి 10 కిలోలు చొప్పున పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ సూరాకాసుల రామలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకుడు సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో శనివారం బాధితులు ధర్నా చేశారు.

    సుమారు 800 తెల్ల రేషన్ కార్డులు కలిగిన అమలాపురం మత్స్యకార గ్రామంలో తుపాను సహాయం కింద బియ్యం పంపిణీ చేయడంలో చౌకడీపో డీలరు తాత్సారం చేశారని బాధితులు తెలిపారు. మత్స్యకారులు ఒత్తిడి చేయడంతో శుక్రవారం మత్స్యకారులకు 50 కిలోలు, ఇతర కులాల వారికి 25 కిలోల చొప్పున పంపిణీ చేశారని చెప్పారు. శనివారం డీలరు 10 కిలోలు మాత్రమే ఇవ్వడం  ప్రారంభించారని, దీనిపై ప్రశ్నిస్తే అలాగే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేక డీలరు దుకాణం మూసి వెళ్లిపోయారు.
     
    డీలరు నిర్లక్ష్యం వల్ల నష్టపోయాం : డీలరు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగిందని, సరుకు వచ్చిన రోజునే పంపిణీ  చేసుంటే అందరికీ 25 కిలోల వంతున అందేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీలరు తాత్సారం చేయడం వల్ల 15కిలోల బియ్యం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌షాపు డీలరు బినామీ అని, తక్షణమే ఆయనను మార్చాలని డిమాండ్ చేశారు. మత్య్సకార గ్రామాల్లో నివ శించే మత్య్సకారేతరులకు కూడా 50 కిలోల చొప్పునే ఇవ్వాలని ఇప్పటికే పలు గ్రామాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో 25కు బదులు 10 కిలోలే ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తమైంది.
     

మరిన్ని వార్తలు