ఎందుకు తొలగించకూడదు

25 Aug, 2014 02:20 IST|Sakshi
ఎందుకు తొలగించకూడదు

సాక్షి ప్రతినిధి, కడప: రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం డిపార్టుమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ను ఆదేశించారు. ఆ మేరకు ఈనెల 13న మెమో 8800/ఏ.2/2014ను జారీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డెరైక్టర్‌గా డాక్టర్ సిద్దప్పగౌరవ్ అనర్హుడని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు.
 
అనస్థీషియా ప్రొఫెసర్‌గా సిద్దప్పకు అర్హత లేదని, కోర్టు ఉత్తర్వుల కారణంగా అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి మాత్రమేనని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు డెరైక్టర్‌గా ఉండే అర్హత ఎంతమాత్రం లేదని ఎన్‌జీఓ అసోసియేషన్ వివరించింది. దీంతో రిమ్స్ డెరైక్టర్‌గా సిద్దప్పగౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో స్పష్టమైన కారణాలు వివరించాలని డీఎంఈని ఆదేశించింది.
 
మరో ఏడాది అవకాశం ఇవ్వండి..
రిమ్స్ డెరైక్టర్‌గా మరో ఏడాది అవకాశం ఇవ్వాలని డాక్టర్ సిద్దప్ప గౌరవ్ డీఎంఈని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వలో రిమ్స్ డెరైక్టర్‌గా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన మరో అవకాశం కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్‌జీఓ హైదరాబాద్ విభాగం  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌జీఓల ఫిర్యాదుపై స్పందించిన ఆయన చర్యల నిమిత్తం డీఎంఈ వివరణ కోరారు.
 
డెరైక్టర్‌ను తొలగించాలి..
రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్పగౌరవ్‌ను తొలగించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజడంచౌదరి, ప్రధాన కార్యదర్శి అహరోన్‌లు కోరారు. తమ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే డీఎంఈ  డెరైక్టర్ తొలగింపునకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను ఆదివారం విడుదల చేశారు.

మరిన్ని వార్తలు