కనికరమెందుకో..?

19 Aug, 2015 01:38 IST|Sakshi
కనికరమెందుకో..?

 సాక్షి, గుంటూరు : ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామంటూ ఓ ఐపీఎస్ అధికారి... గ్రీవెన్స్ ఫిర్యాదులపై అక్కడికక్కడే ఇన్‌స్టంట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని మరో ఐపీఎస్ అధికారి.. బాధితుల ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ పంపుతానని ఇంకో ఐపీఎస్ అధికారి ఎవరికి తోచిన విధంగా వారు ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించడం హర్షణీయమే. మరో వైపు హోంశాఖా మంత్రి చినరాజప్ప ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌లను ప్రవేశ పెడుతున్నట్టు సైతం ప్రకటించారు.

అయితే పోలీసు శాఖలోనే ఒక మహిళా కానిస్టేబుల్‌ను సీఐ వేధించినా ఆయనపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, ఆయనపై పోలీస్ ఉన్నతాధికారులు వల్లమాలిన కనికరం చూపుతుండడంపై మతలబు ఏమిటని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి.  సీఐకు అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నాయని, ఓ ముఖ్య నేత తనయుని అండతో సీఐ పైరవీలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యావంతురాలైన ఓ మహిళా కానిస్టేబుల్‌పై తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటకు వెల్లడించినా సదరు సీఐపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు అంతర్మథనంలో పడ్డారు. ఇలాంటి వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళా కానిస్టేబుళ్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు.

 విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు
 నరసరావుపేట రూరల్ సీఐ శరత్‌బాబు వేధింపులకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు అవాక్కవుతున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను నాగశ్వేతను లోబర్చుకునేందుకు తన మాట వింటే ఇంక్రిమెంట్, వినకపోతే పనిష్‌మెంట్ అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారట. ఆమెకు రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తానని, అవసరమైతే భవనం కట్టిస్తానని పలురకాలుగా ప్రలోభాలకు గురిచేసినట్లు చెబుతున్నారు.

మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపై విచారణ చేపట్టిన మహిళా ఉద్యోగుల సంఘం చైర్మన్ టి.శోభామంజరి ఇప్పటికే నరసరావుపేట రూరల్ సర్కిల్ పరిధిలోని రొంపిచర్ల, నకరికల్లు, ఫిరంగిపురం ఎస్‌ఐలను పిలిపించి వారి పరిధిలో జరిగిన సంఘటనలు, తదితర అంశాలపై స్టేట్‌మెంట్‌లు కూడా నమోదు చేశారు. సీఐ లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమేనని నిర్ధారించారు. ఇంత జరిగినా అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడు, పోలీస్‌శాఖలోని ఓ ఉన్నతాధికారి సీఐపై కేసు నమోదుకాకుండా కాపాడే యత్నం చేస్తున్నట్లు సమాచారం.

whatsapp channel

మరిన్ని వార్తలు