ఎంపీ హరి.. మౌనంతో సరి!

16 Jun, 2017 05:03 IST|Sakshi
ఎంపీ హరి.. మౌనంతో సరి!

విశాఖ భూకుంభకోణాలపై స్పందించని నేత
నగర పరువు మంటగలుస్తున్నా సరే..
మిత్రపక్ష పెద్దల రక్షణకే
కట్టుబడ్డారని ఆరోపణలు
ప్రజాప్రతినిధిగా బాధితుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శలు
సహచర బీజేపీ నేత గర్జిస్తున్నా..
ఈయనది మాత్రం మౌనముద్రే


‘విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నాం..
ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాం..


అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులతో ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చాం’.. అని సందు దొరికినప్పుడల్లా సోది చెబుతుంటారు..
మన ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులవారైన హరిబాబు..


పనిలో పనిగా సీఎం చంద్రబాబును, టీడీపీ జిల్లా నేతలను
కీర్తించడం ఎన్నడూ మరిచిపోలేదు..


మరి అదే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా పేరుతో
ఫలహారం చేసేసిన భారీ కుంభకోణం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది..


బ్రాండ్‌ ఇమేజ్‌ సంగతేమోగానీ.. విశాఖ పరువును మంటగలిపేసినా.. స్థానిక ఎంపీగా హరిబాబు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం : భూ రికార్డులను  తారుమారు చేసి.. గల్లంతు చేసి.. దర్జాగా కబ్జాలపర్వం సాగించిన బడా భూ చోరుల ఆగడాల వల్ల విశాఖ పరువు జాతీయస్థాయిలో దెబ్బతింటోందని విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ పెద్దల భూదాహానికి విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ కొట్టుకుపోతున్నా.. స్థానిక ఎంపీగా హరిబాబు మాత్రం నోరు మెదపడం లేదు. సహచర పార్టీ నేత బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విశాఖ భూ దందాలపై సమయం దొరికినప్పుడల్లా గొంతెత్తుతున్నారు. అధికార టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆధారాలతో సహా ముదపాక భూముల కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రను బట్టబయలు చేశారు. విశాఖ రూరల్, భీమిలితో సహా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లోనే ఎక్కువగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఓ పక్క ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో రూ.2,200 కోట్ల విలువైన భూములకు చెందిన 1బీ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురికాగా...లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

ఉద్యమ బాటలో విపక్షాలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి జాతీయస్థాయి ఉద్యమానికి నడుం బిగించాయి. ఇప్పటికే ముదుపాకలో ఆక్రమణకు గురైన భూముల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచాయి. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీకే చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ పార్టీకి చెందిన వారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బహిరంగంగా ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనంటూ మంత్రి గంటా ఏకంగా అయ్యన్నపై సీఎంకే ఫిర్యాదు చేశారు. ఇలా రోజురోజుకు ఈ భూ కబ్జాల దుమారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. కుంభకోణాల్లో అత్యధిక శాతం తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే జరుగుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా హరిబాబు వీసమెత్తయినా స్పందించ లేదు. ఆయన తీరుపై విశాఖవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ పెద్దలున్నందున సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్షం సన్నాహాలు చేస్తుంటే జాతీయ స్థాయిలో పరపతి కలిగిన హరిబాబు మాత్రం ఆ దిశగా తానూ ప్రయత్నిస్తానన్న పాపాన పోలేదని  బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ కష్టార్జితం కబ్జాకోరుల పాలై మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని వ్యక్తినా.. ఎంపీనా తాము ఎంపీగా ఎన్నుకున్నది అని వారు ఆవేదన చెందుతున్నారు. ‘విశాఖకు అది చేశాం..ఇది చేశాం.. అని  లేని గొప్పలు చెప్పుకోవడం కాకుండా తమ కష్టాలపై స్పందించరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భూ కుంభకోణంపై ఎంపీ హరిబాబు నోరు విప్పి బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మిత్రపక్ష  పెద్దలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతే మాత్రం సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని భూ కబ్జాల బాధితులు హెచ్చరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు