కిలాడీ జంట 

31 Jul, 2019 08:19 IST|Sakshi
కంచర్ల రమేష్‌నాయుడు దంపతులు

పక్కా ప్రణాళికతో రూ.కోట్లు కొల్లగొట్టారు

చిట్టీలు, వడ్డీ వ్యాపారం ముసుగు

‘సాక్షి’ కథనంతో కలకలం

సాక్షి, పశ్చిమ గోదావరి : అధిక వడ్డీలను ఆశచూపి కోట్లు కొల్లగొట్టిన కంచర్ల రమేష్‌నాయుడు, దివ్య దంపతుల ఆచూకీ కోసం కోసం బాధితులు లబో దిబోమంటూ తిరుగుతున్నారు. నరసాపురం వై ఎన్‌ కళాశాల రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రమేష్‌నాయుడు దంపతులు పక్కా ప్లాన్‌తో అందిన కాడికి అప్పులు చేసి, చిట్టీలు కట్టించుకుని కనిపించకుండా పోయారు. బాధితుల ఆవేదనను వివరిస్తూ మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన వార్తతో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. రమేష్‌నాయుడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ చుట్టూ తిరుగుతున్నారు. రమేష్‌నాయుడు దంపతులు దాదాపు రూ.7 కోట్ల వరకూ కుచ్చుటోపీ పెట్టినట్టుగా తెలుస్తోంది. పక్కా ప్లాన్‌ ప్రకారం వీరు అయినకాడికి దండుకున్నారు. బాధితుల్లో ఇంటికొచ్చి పచ్చిరొయ్యలు అమ్ముకునే వృద్ధురాలి నుంచి న్యాయవాదుల కుటుంబాల మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం.

పక్కా ప్లాన్‌తో..
రమేష్‌నాయుడు దంపతులు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ లగ్జరీగా జీవించేవారు. రమేష్‌నాయుడు గతంలో ఓ ప్రముఖ చిట్‌ఫండ్‌ కంపెనీలో పనిచేసేవాడు. ఈనేపథ్యంలో ఇంటి వద్ద చిట్టీలు కట్టించుకోవడం ప్రారంభించారు. అలాగే తాము రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామని చెబుతూ అధిక వడ్డీలకు అప్పులు చేసేవారు. అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలం నూటికి రూ.5, రూ.10 చొప్పున వడ్డీ సొమ్ములు ముట్టజెప్పారు. ఇది బాగా ప్రచారం కావడంతో చాలామంది వీరికి అప్పులు ఇచ్చారు. వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పచ్చిరొయ్యలు అమ్మేవారు, పాలు పోసేవారు కూడా వీరి వద్ద చిట్టీలు కట్టారు. చివరకు అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ను కూడా ఈ జంట వదల్లేదు. పాట పాడుకున్న తరువాత వారికి డబ్బులు ఇవ్వకుండా, అధిక వడ్డీలు ఇస్తామని సొమ్ములు వారివద్దే ఉంచుకునేవారు. రమేష్‌నాయుడు అతని భార్య దివ్య తమ పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజులు అంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్దస్థాయిలో ప్రచారం చేసుకుని పరిచయాలు పెంచుకున్నారు. ఇలా సేకరించిన మొత్తం సొమ్ములతో వీరు ఉడాయించారు.  

పెద్ద సంఖ్యలో బాధితులు  
బాధితుల్లో పెద్దల కుటుంబాల వారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. న్యాయవాదుల నుంచి పెద్ద వ్యాపారుల కుటుంబాల మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు రూ.50 లక్షలు, రూ.30 లక్షలు చొప్పున అప్పులిచ్చినట్టు సమాచారం. అయితే వీరు కేసులు జోలికి వెళ్లకుండా పరిచయస్తుల ద్వారా రమేష్‌నాయుడు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ లో వచ్చిన వార్తతో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చారు. ‘సాక్షి’ వార్తకు స్పందించిన టౌన్‌ ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి కూడా మంగళవారం అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి కొందరితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని నచ్చజెప్పారు. అయితే పోలీసులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు ఇప్పటివరకూ అందలేదు. మొత్తంగా ఈ ఘటన పట్టణంలో సంచలనం కలిగించింది.

మరిన్ని వార్తలు