రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం

12 Aug, 2019 08:28 IST|Sakshi
భర్త నరసింహమూర్తి మృతదేహం, భార్య సత్యవతి మృతదేహం

‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను మరువ లేదేమోనన్నట్టుగా.. ఆ దంపతులు.. ఒకరికొకరు తోడుగా మృత్యు కౌగిట్లోకి ఒదిగిపోయారు. రాజానగరం శివారు శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తోకాడకు చెందిన దంపతులు రాయుడు నరసింహమూర్తి, సత్యవతి.. తిరుగు పయనంలో.. ఆ ఫంక్షన్‌ జరిగిన ఇంటికి సమీపంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బంధువులంటే అతడికి వల్లమానిన అభిమానం. ఎవరింట ఏ కార్యక్రమం జరిగినా.. తప్పనిసరిగా హాజరై అందరితో సరదాగా ఉండే అతడంటే వారందరికీ కూడా ఎంతో అభిమానం. అదేవిధంగా శ్రీరామనగర్‌లో బంధువుల ఇంట నిర్వహించిన ఫంక్షన్‌కు భార్య, కుమారుడితో వచ్చి తిరిగి వెళుతుంటే.. ఆ ఇంటి సమీపంలోనే ప్రమాదానికి గురై భార్యతో సహా చని పోయాడు. విషయం తెలుసుకున్న పంక్షన్‌లోని వారందరూ  పరుగున వెళ్లి విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరం శివారు శ్రీరామనగర్‌ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మండలంలోని తోకాడకు చెందిన రాయుడు నరసింహమూర్తి (55), అతని భార్య సత్యవతి (50) కుమారుడు గోవిందుతో కలసి మోటారు బైకుపై శ్రీరామనగర్‌లోని బంధువుల ఇంట జరిగే ఒక ఫంక్షన్‌కు వచ్చారు. ఫంక్షన్‌ ముగిశాక తిరుగు పయనమై  డివైడర్‌ దాటి అవతల వైపువెళుతుండగా బైక్‌పై ఉన్న వీరిని.. జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైకు నడుపుతున్న కుమారుడు గోవిందుతోపాటు వెనుక కూర్చున్న భార్యాభర్తలు ఎగిరి పడ్డారు. డివైడర్‌పై వర్షపు నీరు పోయేందుకు నిర్మించిన సీసీ బోదెల అంచులకు భార్యాభర్తల తలలు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు.

గోవిందు మాత్రం డివైడర్‌పై గడ్డితో ఉన్న మట్టిపై పడటంతో కాలు, చెయ్యి విరిగింది. వెంటనే అతడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చిన్నతనంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరిలో పెద్దవాడికి, అమ్మాయికి వివాహాలను వారు చేశారు. గాయపడిన కుమారుడు గోవిందు అవివాహితుడు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సమయం మించిపోవడంతో సోమవారం ఉదయం పోస్టుమార్టం చేయించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. 

మరిన్ని వార్తలు