భార్య ఉండగానే మరో రెండు వివాహాలు

2 Nov, 2014 03:59 IST|Sakshi

సంతబొమ్మాళి: భార్య, ముగ్గురు పిల్లలు ఉండగానే మరో ఇద్దరు యువతులను రహస్యంగా వివాహాలు చేసుకుని దర్జా వలగ బోస్తున్నాడో ప్రబుద్ధుడు.  సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేట (పలికిలివానిపేట) గ్రామానికి చెందినన అతడి పేరు పలికిలి కర్రెన్న. అతడి మొదటి భార్య భగవతమ్మ శనివారం విలేకరులకు భర్త నిర్వా కాన్ని వివరించింది. టెక్కలి మండలం భగీరథపేటకు చెందిన పిన్నింటి రాజారావు కుమార్తె భగవతమ్మకు సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేటకు చెందిన కర్రెన్నతో 1994లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రూ.40  నగదు, తులంన్నర బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు 1996లో రాణి అనే ఆడ బిడ్డ పుట్టింది. అప్పటి నుంచి కర్రెన్న భార్య భగవతమ్మకు శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు.
 
 దీంతో ఆమె 1999లో భగీరథపేటలోని పుట్టినింటికి వెళ్లిపోయింది.  భార్యకు తెలియకుండా 2002లో బెంగళూరు వలస వెళ్లి మూడేళ్లు అక్కడే ఉన్న కర్రెన్న అక్కడ వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి 2005లో స్వగ్రామమైన పెద్దకేశనాయుడుపేట వ చ్చాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భగవతమ్మ భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చిన కర్రెన్న ఇరువురితో కాపురం చేస్తానని అంగీకరించాడు. ఎనిమిది నెలలు గడచిన తర్వాత బెంగళూరు నుంచి రెండో భార్య తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను తీసుకు వెళ్లిపోయారు. దీంతో అతడి కాపురం మొదటి భార్యతో కొంతకాలం సాఫీగా సాగింది. ఆ దంపతులకు 2007లో మోహిని అనే కుమార్తె, 2010లో మణి అనే కుమారుడు పుట్టారు. ఆ తర్వాత తరచూ కర్రెన్న భార్యను కొట్టేవాడు. పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపేవారు.
 
 ఇలా పలుమార్లు జరగడంతో పుట్టింటి వద్దే పిల్లలతో భగవతమ్మ ఉండిపోయింది. దీంతో కర్రెన్న ఈ ఏడాది మేలో తిప్పానబొడ్డపాడుకు చెందిన నీలాపు జ్యోతిని రహస్యంగా వివాహం చేసుకుని వేరొక చోట కాపురం పెట్టాడు. ఇటీవల మూడో భార్య జ్యోతిని స్వగ్రామం పెద్దకేశనాయుడుపేటకు తీసుకు రావడంతో మొదటి భార్య భగవతమ్మ ఇదేం పద్ధతని భర్తను నిలదీసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నౌపడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు జూన్‌లో సిద్ధపడింది. పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇంత వరకు న్యాయం జరగకపోవడంతో శనివారం నౌపడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని  తన భర్తపైన, అత్తపైన,మూడో వివాహానికి సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరింది.
 
 న్యాయం చేయండి సారూ...
 నౌపడ పోలీస్‌స్టేషన్ పరిశీలనకు వచ్చిన  ఎస్పీ ఎ.కె.ఖాన్‌కు న్యాయం చేయాలని బాధితురాలు భగవతమ్మ వేడుకుంది. వెంటనే ఎస్పీ స్పందించి భారాభర్తలను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఎస్సైకు సూచించారు.
 

మరిన్ని వార్తలు