సమయం అడిగాడు.. పారిపోయాడు

29 Jan, 2020 08:47 IST|Sakshi
సంతబొమ్మాళిలో భర్త ఇంటికి తాళం వేసి ఉన్న దృశ్యం (ఇన్‌సెట్లో) ఆర్మీ జవాన్‌ సిద్ధార్థ

భర్త ఇంటికి తాళం స్పందనలో ఎస్పీకి భార్య ఫిర్యాదు

రెండో పెళ్లి చేసుకొన్న ఆర్మీజవాన్‌పై న్యాయ పోరాటం

సంతబొమ్మాళి: చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సమయం అడిగాడు.. తీరా సమయం వచ్చే నాటికి ఇంటికి తాళం వేసి పారిపోయిన వైనం మండల కేంద్రం సంతబొమ్మాళిలో చోటుచేసుకుంది. బాధితరాలు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి గ్రామానికి చెందిన వివాహిత అట్టాడ యమునను ఆదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కుసుమకారి సిద్ధార్థ 2017 ఆగష్టు 18న అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. విశాఖట్నంలో రెండేళ్లపాటు కాపురం పెట్టిన తర్వాత వదిలించుకోవడానికి ఎత్తుగడ వేశాడు. అదనపు కట్నం తేవాలని వేధించాడు. 2019 నవంబర్‌ 6న సింహాచలంలో వేరొక అమ్మాయిని  వివాహం చేసుకున్నాడు. భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలియడంతో యమున విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో 2019 నవంబర్‌ 14న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న యమున గతేడాది డిసెంబర్‌ 23న సంతబొమ్మాళిలోని అత్తవారింటికి వచ్చింది.

సిద్ధార్థ తల్లి ఇందిర, బంధువులు కలిసి ఆమెను బయటికి నెట్టేశారు. ఆదేరోజు సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయాన్ని ఎస్‌ఐ కామేశ్వరరావుకు చెప్పింది. వారిని పిలిచి ఎస్‌ఐ మాట్లాడారు. తన కుమారుడు ఆర్మీ విధుల్లో భాగంగా ఢిల్లీలో పని చేస్తున్నాడని, జనవరి 28న (2020) సెలవుపై వస్తాడని, అప్పటివరకు సమయం ఇవ్వాలని తల్లి కోరగా.. పెద్ద మనుషుల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఆ సమయం రానే వచ్చింది.  తల్లి ఇందిర, కుమారుడు సిద్ధార్థ, కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఈ విషయం తెలియక బాధితరాలు యమున కుటుంబ సభ్యులు, వారి తరఫు పెద్ద మనుషులు సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌ వద్ద మంగళవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. దీనిపై ఎస్‌ఐ కామేశ్వరరావును వివరణ అడడగా గతంలో ఒకసారి బాధితరాలు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పిందన్నారు. గ్రామస్తుల సమక్షంలో సమస్య పరిష్కరించుకుంటామని ఆర్మీ జవాన్‌ తల్లి సమయం అడిగితే ఇరు వర్గాల వారు అంగీకారానికి వచ్చారన్నారు. దీనిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు.

న్యాయం ఎప్పుడు జరుగుతుంది?
రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. విశాఖపట్నంలో కేసు నమోదు అయింది. సోమవారం స్పందనలో ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశాను. ఇక్కడికి వస్తే భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉద్యోగానికి సెలవులు పెట్టి వచ్చాను. న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. – కె.యమున, బాధితురాలు 

మరిన్ని వార్తలు