పెళ్లంటే అతడికి ఎగ'తాళి'

9 Sep, 2014 10:00 IST|Sakshi
పెళ్లంటే అతడికి ఎగ'తాళి'

గుంటూరు : మొదట్లో ప్రేమంటాడు.. నువ్వు లేనిదే బతకలేనంటాడు.. నిన్నే పెళ్లాడతానంటూ నమ్మిస్తాడు.. ఈ తంతగాన్ని ఒక్కరితో ఆపకుండా పలువురు యువతులను ఇదే విధంగా ట్రాప్ చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ మృగాడి నైజం గుంటూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. పెళ్లిని  ఎగ‘తాళి’ చేస్తూ తన వాంఛలు తీర్చుకునేందుకు లెసైన్స్‌లా వాడుకుంటున్నాడు. ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని సంతానం కలిగిన తరువాత వదిలించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ మృగాడి మోసానికి బలై చిత్రహింసలు అనుభవించిన ఓ మహిళ  తన ఇద్దరు ఆడపిల్లలతో గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను కలిసి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.

బాధితురాలు ఎస్పీకి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం, మైసూరు జిల్లా, పిరియా పట్టణానికి చెందిన అంబిక పదో తరగతి పూర్తికాగానే 14 ఏళ్ల వయసులో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన పంతగాని సత్యప్రసాద్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు  వారించినా వినకుండా   1999 మే ఐదో తేదీన పొన్నూరు వచ్చి బీబీసీ చర్చిలో వివాహం చేసుకుంది. జూపూడిలో కాపురం పెట్టిన సత్యప్రసాద్ అంబికను చిత్రహింసలకు గురిచేసేవాడు. అంబికను తీవ్రంగా కొట్టి ఇద్దరు ఆడపిల్లలను సైతం పస్తులుంచేవాడు. 2008 వరకూ భర్తతో కలిసి ఉన్న అంబిక ఉద్యోగ నిమిత్తం భర్త బెంగుళూర్ వెళ్లినా తాను మాత్రం జూపూడిలోనే ఉంది.

అక్కడ చిక్‌మంగుళూరుకు చెందిన కవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నట్లు అంబికకు ఫోన్ చేసి చెప్పడంతో నిర్ఘాంతపోయింది. తనకు వారసుడు కావాలని నీకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో మరో పెళ్లి చేసుకున్నానని తనకు ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించాడు.   కవితతో కొన్నేళ్ళు కాపురం చేసిన సత్యప్రసాద్‌కు మళ్ళీ ఆడ పిల్లే పుట్టడంతో ఆమెను కూడా వదిలేసి జూపూడికి వచ్చేశాడు. అంబిక తిరిగి భర్తతో కలిసి కొన్నాళ్లు కాపురం చేసింది.

 మూడో భార్యతో దేశం దాటేందుకు యత్నం..

 తీరు మార్చుకోని సత్యప్రసాద్ ఫేస్‌బుక్‌లో చాటింగ్ ద్వారా ఇవాంజిలిన్ అనే అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి విడాకులు ఇవ్వమంటూ అంబికను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త హింస తట్టుకోలేక తల్లిదండ్రులైనా ఆదరిస్తారనే ఆశతో కర్నాటక వెళ్లింది. వారు ఇంటిలోకి కూడా రానివ్వలేదు.  చేసేది లేక ఇద్దరు ఆడ పిల్లలతో జూపూడికి వచ్చింది. మూడో భార్య ఇవాంజిలిన్‌తో కలిసి దేశం విడిచి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ తీసుకున్నాడని అంబిక పేర్కొంది.

తల్లిదండ్రులు, భర్త తనను వదిలించుకోవాలని చూస్తుండటంతో రోడ్డుపాలయ్యానని విలపించింది. భర్తపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తనలాగా మరే ఆడపిల్ల జీవితం బలి కాకుండా కాపాడాలని కోరింది. స్పందించిన ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పొన్నూరు పోలీసులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు