భర్తే కాలయముడై..

11 Dec, 2014 04:29 IST|Sakshi
భర్తే కాలయముడై..

భీమవరం టౌన్ : తాళికట్టిన భర్తలే కాలయముళ్లుగా మారుతున్నారు. నిత్యం వేధింపులకు గురై లేత వయసులోనే నూరేళ్లు నిండిపోతున్నాయి.  నిన్న ఉమామహేశ్వరి ఉదంతం మరిచిపోకముందే భీమవరం ప్రాంతంలో మరో అబల భర్త అకృత్యానికి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గర్భిణిగా ఉందనే కనికరం కూడా లేకుండా ఉన్మాది చేష్టలతో ఉసురుతీశాడు. వివరాల్లోకి వెళితే.. భీమవరం మండలం పెదగరువుకు చెందిన మేడిది వినోద్‌కుమార్.. కొమరాడ గ్రామానికి మరియమ్మను నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి మూడేళ్ల కుమార్తె శ్రీకుమారి ఉంది. మరియమ్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి.  హైదరాబాద్‌లో తాపీ పని చేసుకుంటూ వినోద్‌కుమార్ కుటుంబం కొంతకాలంగా అక్కడే ఉంటోంది. మరియమ్మ తండ్రి డేవిడ్ గతంలోనే చనిపోగా, తల్లి ఆశీర్వాదం దుబాయ్‌లో ఉంటోంది.
 
 ఇదిలా ఉండగా, చిన్న చిన్న విషయాలకు కూడా వినోద్‌కుమార్ భార్య మరియమ్మను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. అతనికి దూరంగా వచ్చేయాలని ఎన్నోసార్లు బంధువులు ఆమెకు చెప్పారు. అయినా తన భర్తతోనే ఉంటానని మరియమ్మ వారికి నచ్చజెప్పేది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండగకు మంగళవారం ఉదయం కొమరాడలోని నాన్నమ్మ ఇంటికి వినోద్‌కుమార్ కుటుంబం వచ్చింది. రాత్రి వినోద్‌కుమార్ భార్యతో గొడవకు దిగి ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టాడు. అడ్డువచ్చిన మరియమ్మ నాన్నమ్మ, అమ్మమ్మలను సైతం తోసివేశాడు. దీంతో వారు కేకలు వేయగా స్థానికులు గుమికూడారు. ఇంతలోనే భార్య గొంతు, పొట్టను గట్టిగా నొక్కి హత్య చేశాడు.
 
 ఆమె మృతి చెందినా హింసిస్తుండటాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో వినోద్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడ్నించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి భర్త వినోద్‌కుమార్ కోసం గాలించారు. బుధవారం ఉదయం తహసిల్దార్ గంధం చెన్నుశేషు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 అమ్మ నిద్రపోతోంది.. లేపకండి
 తల్లి నిద్రపోతోందని భావించి అక్కడే ఉన్న చిన్నారి శ్రీకుమారిని చూసి స్థానికులు చలించిపోయారు. మరియమ్మ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులతో తన తల్లి నిద్రిస్తోందని.. లేపవద్దని చెప్పడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిని పోగొట్టుకున్న చిన్నారి భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు.  
 
 భర్తే కావాలంది..
 ప్రేమించి పెళ్లాడిన భర్త వినోద్‌కుమార్ అంటే మరియమ్మకు ఇష్టం. అయితే చీటికిమాటికి భార్యతో గొడవపడి భర్త చిత్రహింసలకు గురిచేస్తున్న వినోద్‌కుమార్ ప్రవర్తనతో బంధువులు విసుగు చెందారు. అతని నుంచి దూరంగా ఉండాలని హితవు పలికారు. అయినా మరియమ్మ తనకు భర్తే జీవితమంటూ వారికి నచ్చజెప్పింది. అతనిలో మార్పు వస్తుందని ఆశించింది. అయితే రానురాను అతని ప్రవర్తన మితిమీరడం.. మరియమ్మ తండ్రి లేకపోవడం, తల్లి దుబాయ్‌లో ఉండటం, అమ్మమ్మ, నాన్నమ్మ వృద్ధులు కావడంతో వినోద్‌కుమార్‌ను నిలదీసేవారు లేకపోయారంటూ బంధువులు వాపోతున్నారు. దీంతో అతని చేష్టలు శ్రుతిమించి తమ మనవరాలు బలైందని కన్నీరుమున్నీరయ్యారు.  
 

 

మరిన్ని వార్తలు