కట్టుకున్న వాడినే.... కసిదీరా చంపింది!

27 Apr, 2014 09:31 IST|Sakshi
కట్టుకున్న వాడినే.... కసిదీరా చంపింది!

‘మన బంధానికి నా భర్త అడ్డుగా ఉన్నాడు. అడ్డు తొలగించుకుందాం. సాయంత్రం మామిడితోటకు నీరు పెట్టేందుకని తీసుకొస్తా. అక్కడ మట్టుపెట్టేద్దాం.’పక్కనే ఉన్నది తన భార్యే కదా అని.. ఆ భర్త మామిడితోటకు నీరు పెట్టే పనిలో నిమగ్నమయ్యూడు. ఈలోగా అతని రెండు చేతులను వెనక్కి విరిచి పట్టుకుంది ఆ ఇల్లాలు. ఇదే అదును కోసం ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు కత్తితో విచక్షణారహితంగా అతనిపై దాడి చేశాడు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను.. మరో వ్యక్తి కత్తితో పొడుస్తుంటే.. ఆ పడతి చూసి ఆనందించసాగింది.  అప్పటికే ఆమె భర్త ప్రాణాలు విడిచాడు. అయినా ఆమె కసితీరలేదు. ఒక వేళ అతను ప్రాణాలతోనే ఉంటే.. తన విషయం నలుగురికీ చెబితే అన్న ఆలోచన ఆమెను మరింత క్రూరంగా మార్చేసింది. వెంటనే ప్రియుడితో కలసి అతనిని బావిలో పడేసింది.

ఇదేదో సినిమాకు సంబంధించి రాసుకున్న స్క్రిప్ట్ కాదు. సినిమాను పోలి ఉన్న నిజ జీవిత ఘట్టం. పెద్దల సాక్షిగా.. వేదమంత్రాల నడుమ మనువాడిన భర్తనే కిరాతకంగా హత్య చేసింది.. చేయించింది ఆ ఇల్లాలు.
 
 
 విజయనగరం (బుదరాయవలస : మెరకముడిదాం) : మండలంలోని గాదెలమర్రివలసలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందరూ ఊహించినట్టుగానే కట్టుకున్న భార్యే.. ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. చీపురుపల్లి సీఐ ఎస్.రాఘవులు, బుదరాయవలస ఎస్సై కె.ప్రయోగమూర్తి ఈ కేసును కొద్దిరోజుల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సీతారాంను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.
 
 ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గాదెలమర్రివలసకు చెందిన వలిరెడ్డి లక్ష్మి అనే వివాహితకు, ఇదే మండలం ఊటపల్లికి చెందిన పొట్నూరు సీతారామ్‌కు వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు అవుతున్నాడని భావించిన లక్ష్మి... ఎలాగైనా భర్త వలిరెడ్డి శ్రీనును హతమార్చాలని నిశ్చయిచుకుంది. ఈ నెల 21వ తేదీన ప్రియుడు సీతారామ్‌కు ఫోన్ చేసింది. ‘మధ్యాహ్నం మామిడితోటకు నీరు పెడదామని నా భర్త శ్రీనును తీసుకొస్తాను. నువ్వు అక్కడికి వస్తే ఇద్దరమూ కలసి అతనిని చంపేద్దామ’ని చెప్పింది. అనుకున్నట్లగానే భర్తను మామిడితోటకు తీసుకెళ్లింది. సాయంత్రం 4.30 సమయంలో మామిడిమొక్కలకు శ్రీను నీరు పోస్తున్నాడు. అదే సమయంలో సీతారామ్ అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న లక్ష్మి.. భర్త శ్రీనును వెనుక నుంచి గట్టిగా పట్టుకుంది.
 
 వెంటనే సీతారాం కత్తితో శ్రీను తలపై నరికేందుకు ప్రయత్నించాడు. శ్రీను విడిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. వీరిద్దరూ వదలకుండా కత్తితో తలపై బలంగా మోదారు. దీంతో అతనుఅక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఇద్దరూ మామిడిమొక్కలకు నీరు పోసేందుకు తీసుకువచ్చిన కావిడికి ఉన్న కట్టికి శ్రీనును కట్టారు. సమీపంలో ఉన్న బావి వద్దకు తోడ్కొని వెళ్లారు. బావిలో శ్రీనును పడేశారు. చనిపోయూడన్న నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయూరు. శ్రీను ఆచూకీ లేకపోవడంతో బంధువులు వెతకడం మొదలుపెట్టారు. సీతారాంపురం గ్రామసమీపంలో ఉన్న నేలబావిలో అతను విగతజీవై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
 
 చీపురుపల్లి సీఐ ఎస్.రాఘవులు, బుదరాయవలస ఎస్సై కె.ప్రయోగమూర్తి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై బలమైన గాయూలు ఉండడంతో ఎవరో హత్య చేసి ఉంటారని నిర్ధారించుకున్నారు. మృతుడు భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం ఆమె ప్రియుడు సీతారామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నిందితులు చేసిన నేరం ఒప్పుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలకు అభినందించారు.
 

మరిన్ని వార్తలు