అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

10 Aug, 2015 00:45 IST|Sakshi

జొన్నాడ (ఆలమూరు) : ఆలమూరు మండలం జొన్నాడలో పెనుగొండ దేవి (24) అనే వివాహిత శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త బాలకృష్ణ అత్త, మామ వెంకన్న, సత్యవతి వేధింపులు భరించలేకే ఉరి వేసుకుని ఉండవచ్చని స్థానికులు... అత్తింటివారే చిత్రహింసలు పెట్టి హతమార్చారని దేవి తల్లి దండ్రులు అంగర కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం స్థానిక తారక రామ కాలనీలో నివాసముంటున్న దేవి, బాలకృష్ణ దంపతులకు 2007 మే నెలలో వివాహమైంది. వీరికి పిల్లలు సంధ్య, ఉదయ్ కుమార్ ఉన్నారు. మూడేళ్ల పాటు సఖ్యతగానే ఉన్న భర్త బాలకృష్ణ అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
 
 ఇటీవల తరచూ ఇంట్లో గొడవలు పడటంతో స్థానిక పాత కాలనీకి బాలకృష్ణ, దేవి దంపతులు మకాం మార్చారు. అయినా  పరిస్థితి మారలేదు. శనివారం రాత్రి మీ అమ్మాయికి ‘ఒంట్లో బాగోలేదు-కడుపు నొప్పి వస్తోంది’ అంటూ సంధిపూడిలోని దేవి తల్లిదండ్రులకు ఆమె మరిది శ్రీను ఫోన్ చేశాడు. కలవ రం చెందిన వారు ఒక గంట తరువాత ఫోన్ చేయగా మృతి చెందిందని తెలియజేయడంతో  తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. జొన్నాడలోని తారక రామ పాత కాలనీకి చేరుకోగా అప్పటికే అద్దె ఇంట్లో మృతి చెందిన దేవి మృతదేహాన్ని బాలకృష్ణ తల్లిదండ్రుల ఇంటికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది. వంట విషయంలో గొడవ పడి బయటకు వెళ్లి, ఇంటికి చేరుకునే లోపే ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిందని భర్త బాలకృష్ణ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
 
 కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు..
 తమ కుమార్తె దేవిని అత్తింటివారు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు కొండయ్య, లక్ష్మి ఆరోపిస్తున్నారు. కొట్టడంవల్లే చనిపోయిందని, తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు.  భర్త బాలకృష్ణ,  కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 పోలీసుల విచారణ
 మృతురాలు దేవి నివాసముంటున్న జొన్నాడలోని పాత తారకరామ కాలనీ, అత్తమామలు నివాసముంటున్న కొత్త కాలనీలో స్థానిక పోలీసులు విచారణ జరిపారు. తహశీల్దారు పి.రామమూర్తి, సీఐ వి.పుల్లారావు, ఎస్సై ఎం.శేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన దేవి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో తామే కిందకు దింపామని ఇంటి యజమాని మారిశెట్టి శ్రీనివాసు తెలిపారు. భర్త, అత్త మామల వేధింపుల వల్లే దేవి మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు