భర్తకు అంతిమ సంస్కారాలు చేసిన భార్య

7 Jul, 2016 11:17 IST|Sakshi

కడదాకా తోడుంటానని తలపై చెయ్యేసి ఒట్టేసి... బతుకంతా నీడనిస్తానని తాళిబొట్టు సాక్షిగా మాట ఇచ్చి.. తనతో కలిసి ఏడడుగులు నడిచిన భర్త అర్థాంతరంగా కనుమరుగైతే ఆమె కన్నీరుమున్నీరయింది. తోడూనీడగా ఉండాల్సిన వాడు కానరాని లోకాలకు తరలిపోయి తనను ఒంటరి చేసినందుకు  బోరున ఏడ్చింది. తిరిగిరాని లోకాలకు బయల్దేరిన భర్తకు తానే తుడి వీడ్కోలు పలకాలని భావించి అంతిమ సంస్కారాల్లో పాలుపంచుకుంది. కుటుంబ సభ్యులు వారిస్తున్నా కాదని కన్నీళ్లతో అంత్యక్రియలు నిర్వర్తించి భార్యాభర్తల బంధానికి కొత్త అర్థాన్ని చెప్పింది.
 

రోలుగుంట : దశాబ్దానికి పైగా సాగిన ఆ కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. అనారోగ్యం రూపంలో భర్తను కాటేసింది. మృత్యువు పగబట్టి ఆ బంధాన్ని విడదీసింది.  విశాఖ జిల్లా మండల కేంద్రం రోలుగుంటలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఆడారి అప్పారావు జీవితం అస్వస్థత కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. పదేళ్లుగా అప్పారావు,  అరుణల వైవాహిక జీవితం ఉన్నంతలో సాఫీగా సాగింది. పదేళ్లకు పైగా తనతో తోడూనీడగా నడిచిన భర్త ఏడాది అనారోగ్యం తర్వాత తిరుగురాని లోకాలకు వెళ్లే సరికి అరుణ గుండెలవిసిపోయే విధంగా రోదించింది. అన్నీ తానైన భర్త కనుమరుగైన తన దురదృష్టాన్ని తలచుకుని కుమిలిపోయింది. ఇంతకాలం తనకు ఆసరాగా నిలిచిన భర్త రుణాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలని ఆమె తలచింది. బుధవారం భర్త అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా తాను అంతిమ క్రియల్లో పాల్గొంటానని చెప్పింది. అప్పారావు తోడబుట్టిన వారు, బంధువులు వారించినా కాదని తానే చితికి నిప్పంటించి భార్యగా రుణాన్ని తీర్చుకుంటానని పట్టుబట్టి తన మాట నెగ్గించుకుంది. మృతదేహాన్ని రుద్రభూమికి తీసుకెళ్లినపుడు దారి పొడవునా ముందు నడిచి, రుద్రభూమిలో భర్త భౌతిక దేహం  చుట్టూ కుండతో మూడు సార్లు ప్రదక్షిణ చేసి చితికి నిప్పు అంటించింది. గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు ఆమె వెంట రుద్రభూమికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు