భర్త కోసం అత్తారింటి వద్ద ఆందోళన

20 Nov, 2018 13:24 IST|Sakshi
కోటంక గ్రామంలో భర్త ఇంటి ముందర ఆందోళన చేస్తున్న జోత్స్న, మహిళా సంఘం సభ్యులు

అనంతపురం, గార్లదిన్నె: భర్త కోసం భార్య అత్తారింటి ముందర న్యాయ పోరాటానికి దిగిన సంఘటన మండల పరిధిలోని కోటంక గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు, మహిళా సంఘం సభ్యుల కథనం మేరకు... ధర్మవరం మండలానికి చెందిన చంద్రకుమార్, కృష్ణవేణి దంపతుల కుమార్తె జోత్స్నను గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన మహేష్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. తర్వాత మనస్పర్థలు వచ్చాయి. పెద్ద మనుషులు పలుమార్లు నచ్చజెప్పి వారిని కలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో ఓసారి భార్యాభర్తలు గొడవపడటంతో ఆమె పుట్టింకి వెళ్లిపోయింది. తీసుకెళ్లడానికి భర్త రాకపోవడంతో ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో భర్తపై కేసు పెట్టింది.

మహేష్‌ కూడా తనకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేసి జోత్స్నకు నోటీసులు పంపించారు. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి పద్మావతితో కలిసి అత్తారింటి ముందర ఆందోళనకు దిగింది. ఈ సమయంలో ఇంటివద్ద భర్త అత్తామామలు ఎవ్వరూ లేరు. ఈ సందర్భంగా జోత్స్న మాట్లాడుతూ ‘నా భర్త నాకు కావాలి. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడి సంరక్షణ భారమవుతుంది. పెళ్లి సందర్భంలో తల్లిదండ్రులు రూ.10లక్షలు కట్నం, 20 తులాలు బంగారం ఇచ్చారు. నా భర్త నన్ను ఎందుకు వద్దనుకుంటున్నాడో సమాధానం కావాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీ భర్త వచ్చాక చూద్దామని, స్టేషన్‌ వద్దకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కానీ ఆమె తన భర్త వచ్చే వరకు ఇక్కడే ఉంటానని బీష్మించుకుని కూర్చుంది. పోలీసులు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. ఆమెతోపాటు తల్లిదండ్రులు చంద్రకుమార్, కృష్ణవేణి, బంధువులు, మహిళా సంఘం సభ్యులు లక్ష్మిదేవి, పార్వతీ, నూర్జహాన్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు