వివాహిత దీక్ష విజయవంతం

26 Mar, 2018 10:28 IST|Sakshi
భర్తతో కలసి మీడియాతో మాట్లాడుతున్న పోలా పుష్పావతి

భర్త చెంతకు చేరిన భార్య

ధర్మవరంటౌన్‌:భర్త కోసం మెట్టినింటి ఎదుట భార్య చేపట్టిన దీక్ష విజయవంతమైంది. ప్రజాసంఘాలు, పోలీసుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో అత్తింటి వారు మెట్టుదిగి వచ్చారు. కోడలిని ఇంట్లోకి ఆహ్వానించారు. వివరాల్లోకెళితే.. ధర్మవరంలోని చంద్రబాబునగర్‌లో నివాసం ఉంటున్న పోలా వెంకటరంగనాయకులు, పోలా పుష్పావతి దంపతుల కాపురంలో కలతలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అయితే తన భర్త తనకు కావాలంటూ పుష్పావతి అత్తింటి ఎదుట మూడు రోజుల కిందట మౌనదీక్ష చేపట్టింది. తొలి రెండు రోజులు అత్తింటి వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మహిళా సంఘాలు, ఐసీడీఎస్‌ అధికారులు నచ్చజెప్పినా వినలేదు.

మూడో రోజు ఆదివారం సీపీఐ నాయకులు, మహిళా సంఘం సభ్యులు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం సభ్యులు పుష్పావతి అత్తమామలతో చర్చించారు. చివరకు పోలీసులు కూడా తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో అత్తమామలు, భర్త మనసు కరిగి.. పుష్పావతిని ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరించా రు. ఇక నుంచి భార్యను చక్కగా చూసుకుంటానని భర్త మీడియా సమక్షంలో తెలిపారు. తన పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పుష్పావతి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జింకా చలపతి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, పట్టణ ప్రధాన కార్యదర్శికాంతమ్మ, గంగాదేవి, మహేశ్వరి, సీపీఐ అనుబంధ మహిళా విభాగం సభ్యులు పద్మావతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు