తిరుమల వీధుల్లో వన్యమృగాలు

9 Apr, 2020 07:40 IST|Sakshi
పార్వేటమండపం వద్ద కనిపించిన ఏనుగులు, పగలే ఘాట్‌రోడ్డులో పరుగులు తీస్తున్న జింకలు

భయభ్రాంతులవుతున్న స్థానికులు, ఉద్యోగులు

లాక్‌డౌన్‌తో ఏడుకొండల్లో అలుముకున్న నిశ్శబ్దం

ఘాట్‌రోడ్లపైకి వస్తున్న జింకలు, చిరుతలు

తిరుమల: నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్‌ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్‌ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది. ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది.  

ఘాట్‌ రోడ్డులో అధికం...
ముఖ్యంగా రెండు ఘాట్‌ రోడ్లలో చిరుతల సంచారం పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్‌ రోడ్లను అనుసంధానం చేసే లింక్‌ రోడ్డులో చిరుత కనపడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు. మొదటి ఘాట్‌ రోడ్డుపై జింకలు, కణితి, దుప్పిలు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు.

128 ఏళ్లనాటి వాతావరణం..!
1900 తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రావడంతో క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్‌ రోడ్లపైకి వచ్చేశాయి. 128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు