పట్టుబడిన అడవి జంతువుల వేటగాళ్లు

7 May, 2019 13:45 IST|Sakshi
పట్టుబడిన వేటగాళ్లు

వైఎస్‌ఆర్‌ జిల్లా , అట్లూరు: అడవి జంతువులను వేటాడి, భక్షించే వ్యక్తులను సిద్దవటం రేంజ్‌ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. లంకమల్లేశ్వర అభయారణ్యం కొండూరు బీటు పరిధిలో అటవీ జంతువులను వేటాడుతున్న ఐదుగురు వేటగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి వలలు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక కొండకోడిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు బద్వేలు పట్టణం రిక్షాకాలనీకి చెందినవారిగా సమాచారం. గతంలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. అట్లూరు మండలంలోని దేవనగర్‌ దగ్గర పొట్టేళ్లను కూడా ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అయితే అటవీ అధికారుల అదుపులో ఉన్న వేటగాళ్లను ఈ కోణంలో విచారించినట్లు తెలిసింది. పట్టుబడిన వారిని నేడో, రేపో కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. అయితే వేటగాళ్లు వాడుతున్న ద్విచక్రవాహనాలు దొంగిలించినవా? లేక సొంత వాహనాలా ? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై సిద్దవటం రేంజ్‌ అధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’వివరణ కోరగా వేటగాళ్లు పట్టుబడిన విషయం వాస్తవమేనని తెలిపారు. విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలపారు.

మరిన్ని వార్తలు