రూ. 2 వేల కోట్లిచ్చి ఆదుకోండి!

14 Oct, 2014 01:02 IST|Sakshi

కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
 
విశాఖపట్నం: విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర తుపాను సహాయ, పునరావాస చర్యల కోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ. 2 వేల కోట్లు ఇవ్వమని అడగనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను, బాధితులను చూశాక తన మనసు వికలమైందని సీఎం అన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పటికి రెండుసార్లు చర్చించానన్నన్నారు. ప్రధాని మోదీ మంగళవారం విశాఖపట్నం వచ్చే అవకాశాలున్నాయని సీఎం చెప్పారు. ప్రస్తుతం బాధితలకు ఆహారం, తాగునీరు అందించడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా నెలకు సరిపడా సరుకులను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి పాలు, నీళ్ల ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా విశాఖపట్నానికి తరలించనున్నట్టు పేర్కొన్నారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు సహాయ, పునరావాస చర్యల బాధ్యతలు అప్పగించామన్నారు. ఏరియల్ సర్వే ద్వారా తుపాను బాధిత ప్రాంతాలను చూసి తన మనసు చితికిపోయిందన్నారు. అందాల విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి దయనీయంగా మారిందని వ్యాఖ్యానించారు.

పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే..

 విశాఖలో విద్యుత్తు సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించనున్నట్టు సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో తుపాను బాధిత ప్రజల కళ్లల్లో మళ్లీ కళ చూసేంతవరకు ఈ ప్రాంతంలోనే ఉండనున్నట్టు తెలిపారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు బాబు చెప్పారు.
 

మరిన్ని వార్తలు