సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తా: చంద్రబాబు

13 Nov, 2014 01:19 IST|Sakshi
సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు, చిత్రంలో సీఎం రమేశ్, జయదేవ్ తదితరులు

* సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు  
* తిరుమలలో ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక  దర్శనాన్ని పరిశీలిస్తాం
* సెకండ్ మినిస్టర్ ఈశ్వరన్‌తో భేటీ.. వాణిజ్యావకాశాలపై చర్చ
* పెట్టుబడులకు అవకాశాలపై ప్రజెంటేషన్
* సింగపూర్ నదిని సందర్శించిన చంద్రబాబు బృందం

 
సాక్షి, హైదరాబాద్: సింగపూర్ తరహాలో ఏపీ నూతన రాజధానిని నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీ కొత్త రాష్ట్రమైనందున సమస్యలున్నట్లే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నారు. సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తిరుమలలో ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక  దర్శనం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణను చంద్రబాబు సన్మానించారు.
 
  సమాచార సలహాదారు కార్యాలయం  బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... ముఖ్యమంత్రితోపాటు రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి  సింగపూర్ సెలెటర్ విమానాశ్రయానికి (చాంగి విమానాశ్రయంలో ఒక భాగం) చేరుకుంది. వారికి స్థానిక తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సెకండ్ మినిస్టర్ ఎస్. ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై రూపొందించిన వీడియో ద్వారా మంత్రికి సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు బృందం సెంటర్ ఫర్ లివబుల్ సిటీతో పాటు సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శించి లివబుల్ సిటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ లిమ్ సీ కెంగ్‌తో సమావేశమయ్యారు.
 
బీచ్ టూరిజంపై ఆరా...

 సింగపూర్ నదిని చంద్రబాబు ప్రతినిధి బృందం సందర్శించింది. నదిని ప్రక్షాళన చేసేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. బీచ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు.  రాష్ర్టంలోని 13  ఓడరేవుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను పోర్టు అధికారులకు తెలిపారు.

మరిన్ని వార్తలు