భవిష్యత్తులో ‘బంగారు తెలంగాణ ’: కేవీ రమణాచారి

26 Nov, 2013 05:33 IST|Sakshi

భీమ్‌గల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతోనే సరిపెట్టుకోకుండా తెలంగాణలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని వర్గాలకు న్యాయం జరిగే లా భవిష్యత్తులో బంగారు తెలంగాణను సాధించుకుందామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిచిన టీఆర్‌ఎస్ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
 
 తాను చెన్నారెడ్డి నుంచి మొదలుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు అందరు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానన్నారు. కానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ కోసం పోరాడుతున్నానన్నారు. 13 ఏళ్ల పో రాటాల ఫలితం చివరి దశకు చేరుకుందన్నారు.  ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం రాలేదని, కేవలం ప్రకటన మాత్రమే వచ్చిందన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడంలో కాంగ్రెస్ మోసగాళ్లు ఆరి తేరారన్నారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రకటనలకు మోసపోవద్దని, భవిష్య త్తు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ లు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు ప్రజలకు ముఖం చాటేసిన నాయకులు ఇప్పుడు తాను ముఖ్యమంత్రినంటే తానని తగువులాడుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ తో పొత్తు కల అని, వారి మాటల్ని నమ్మవద్దన్నారు. తెలంగాణకు ముమ్మాటికీ సృష్టకర్తలం మనమేనన్నారు.
 
 ఓయూలో అనిల్‌ను పరిగెత్తించినం: గాజరి కిశోర్‌కుమార్
 బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి అని టీఆర్‌ఎస్‌వీ సెక్రటరీ జనరల్ గాజరి కిషోర్‌కుమార్ విమర్శించారు. పదవికి రాజీనామా చేయకుండా వచ్చిన అనిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీలో పరిగెత్తించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ తమపై కేసులు ఉన్నాయన్నా రు. పదవుల కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి వద్ద మొకరిల్లే అనిల్, పచ్చి సమైక్యవాది అన్నారు. రాజీనామాల సమయంలో అమెరికాకు పారిపోయాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బాల్కొండ ప్రజలు అనిల్‌ను చిత్తగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బానాల లకా్ష్మరెడ్డి, విఠల్‌రావ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండ ప్రకాష్‌గౌడ్, మండల కన్వీనర్ దొన్కంటి నర్సయ్య, సొసైటీ చెర్మైన్, వైస్ చెర్మైన్‌లు కోనేరు బాల గంగాధర్, చౌట్‌పల్లి రవి, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు