కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు

28 Nov, 2013 04:01 IST|Sakshi

మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ అధికారులంతా విధుల్లో కష్టపడి పనిచేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. బుధవారం స్థానిక శాలిమార్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేకకార్యక్రమంలో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన మెప్మా పీడీ పద్మహర్షను ఘనంగా సన్మానించారు.
 
 ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగరీత్యా బదిలీలు సహజమేనని, కానీ విధుల్లో ఉన్నరోజులు కష్టపడేతత్వంతో రాణించేలా ప్రతి అధికారి కృషిచేయాలని ఆకాంక్షించారు. మెప్మా పీడీ పద్మహర్ష జిల్లాకు వచ్చిన రెండేళ్ల కాలంలో మెప్మాలో బాగా కష్టపడి రాణించారని అభినందించారు.
 
 అదేవిధంగా ఒక మహిళా అధికారి కావడంతో మహిళల సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరిస్తూ సంఘాలను బలోపేతం చేశారని కొనియాడారు. ఏదేని మహిళలకు సంబంధించిన కార్యక్రమాన్ని అప్పగిస్తే తన సొంత పనిలా భావించి విజయవంతంగా నిర్వహించేవారని, ఇందు కు బతుకమ్మ కార్యక్రమమే నిదర్శనమన్నారు. ఆమె ఇకముందు కూడా బాధ్యతాయుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధుల నిర్వహణలో ఆమెను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని రాణించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పీడీ పద్మహర్షకు జిల్లాతో నాలుగేళ్ల అనుబంధం ఉందన్నారు. జిల్లా ప్రజలకు ఆమె అనేక సేవలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.
 
 జిల్లాను మరిచిపోలేను: పద్మహర్ష
 జిల్లాలో పనిచేసిన నాలుగేళ్లలో తనకు సహకరించిన కలెక్టర్‌తో పాటు ఇతర అధికారుల సహకారం, జిల్లాప్రజలు అందించిన అభిమానాన్ని మరిచిపోలేనని బది లీపై వెళ్తున్న పీడీ పద్మహర్ష అన్నారు. అయితే విధుల్లో తనవంతుగా రాణించానని చెప్పారు. ఇకముందు కూడా ఇలాంటే సేవలనే కొనసాగిస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట్ ఆర్డీఓ యాస్మిన్‌బాషా, పట్టణ మహిళా సమాఖ్య కార్యదర్శి యాదమ్మతోపాటు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు