ఆ బస్సులను రానిచ్చేది లేదు

18 Apr, 2015 08:24 IST|Sakshi
ఆ బస్సులను రానిచ్చేది లేదు

శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతున్నాయి. తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. ఇప్పటికీ తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే మరోవైపు తమిళనాడు బస్సులు మాత్రం ఎంచక్కా తిరుగుతూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి.

దాంతో వరదాయపాళెం గ్రామస్థులు మండిపడ్డారు. తమిళనాడు బస్సులను తమ పొలిమేరలు దాటనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పోలీసుస్టేషన్లో కూడా చెప్పారు. తమ ప్రాంతానికి వస్తే వాటిని అడ్డుకోవడం ఖాయమని తేల్చిచెప్పారు. సోమవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు బస్సులను తిరగనివ్వబోమని అన్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు