‘ఆంధ్రజ్యోతి’పై కచ్చితంగా చర్యలు తీసుకుంటా’

13 Apr, 2019 07:30 IST|Sakshi

నాకు తెలియకుండా తప్పుడు రాతలు

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఉగ్గు నాగేశ్వరరావు

పిడుగురాళ్ల: తాను ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూ ఇవ్వకుండానే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో తన పేరుతో తప్పుడు కథనాలు రాయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉగ్గు నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనను అడ్డుపెట్టుకుని ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా గురజాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి వద్ద తనను అప్రదిష్ట పాలు చేసే విధంగా తప్పుడు కథనాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాసు కుటుంబం ఆర్యవైశ్యులకు ఎప్పుడూ దూరంగా ఉంటారని, ఆ సామాజికవర్గం వారి పట్ల శ్రద్ధ చూపరంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 11న తప్పుడు రాతలు ప్రచురించారన్నారు. గతంలో కూడా తనను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు, కథనాలు రాశారని, అప్పుడు కూడా మందలించినట్లు గుర్తు చేశారు. అయినా వారి పంథా మార్చుకోకుండా, తన ప్రమేయం లేకుండా తాను కాసు కుటుంబంపై అసంతృప్తిగా ఉన్నట్లు తప్పుడు కథనాలు రాయడం సరికాదని మండిపడ్డారు. తమ లాంటి ఆర్యవైశ్యుల పరువును బజారున పెట్టడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాసే ఆంధ్రజ్యోతి పత్రికపై, సంబంధిత వ్యక్తిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాను ఎన్నో పూజలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు

మరిన్ని వార్తలు