ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పండి... రూ.10 లక్షలు గెలుచుకోండి

11 May, 2014 00:08 IST|Sakshi
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పండి... రూ.10 లక్షలు గెలుచుకోండి

జ్యోతిష్యులకు హేతువాదుల సవాల్
 
 హైదరాబాద్  ఎన్నికల ఫలితాలను కచ్చితంగా చెప్పి రూ. 10 లక్షలు గెలుచుకోవాలని దేశంలోని జ్యోతిష్యులకు హేతువాదులు సవాల్ విసిరారు. హేతువాద ఉద్యమ నేత బాబు గోగినేని, లక్ష్మణ్‌రెడ్డి (జనచైతన్య వేదిక), సాంబశివరావు(మానవ వికాస వేదిక), డీఎస్‌ఎన్ రాజు(దిశ సైన్స్ సెంటర్)లు శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా తమకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తులున్నాయని, జ్యోతిష్యం సైన్స్ అని నమ్మబలికే జ్యోతిష్యులకు తాము ఈ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. 40 ఏళ్లుగా తాము చేస్తున్న సవాళ్లకు జవాబు చెప్పలేక జ్యోతిష్యులు భంగపడుతూనే ఉన్నారన్నారు. అఖిల భారత హేతువాద సంఘాల సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ నరేంద్రనాయక్ సంధించిన 20 ప్రశ్నలకు 19 సరైన సమాధానాలు చెప్పిన వారు ఎవరైనా పారితోషికాన్ని పొందవచ్చన్నారు.

 జోస్యం చెప్పాల్సిన అంశాలు...

 1. కాబోయే భారత ప్రధానమంత్రి ఎవరు?
 2. ఏ పార్టీ లేక పార్టీలతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? (సంకీర్ణ ప్రభుత్వం అయితే, ఎన్ని పార్టీలు ఉంటాయి? వాటిలో ఏయే పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయో తదితర 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.) సవాలును ఎదుర్కొనే వారు తాము విధించిన నియమ నిబంధనల మేరకు తమ జోస్యాన్ని రాతపూర్వకంగా మే 12లోపు నరేంద్రనాయక్, వీటీరోడ్- కర్ణాటక అనే చిరునామాకు పంపించాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు