నేడూ నో ఛాన్స్‌..!

6 May, 2020 13:13 IST|Sakshi

జిల్లాలో తెరుచుకోని మద్యం దుకాణాలు  

75 శాతం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మద్యపానాన్ని క్రమంగా మానిపించే దిశగా చర్యలు  

ఒంగోలు: జిల్లాలో మద్యానికి బ్రేక్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మద్యం షాపులు తెరవలేమని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ అండ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా వైన్‌ షాపులకు స్టాకు తరలించే మద్యం డిపోలు జిల్లాలో ఒంగోలులో ఒకటి, మార్కాపురంలో ఒకటి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో మద్యం డిపోల వద్దకు పెద్ద ఎత్తున సరుకు తరలింపునకు వాహనాలు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున కలెక్టర్‌  పోల భాస్కర్‌ ఈ వ్యవహారంలో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులతో పలు మార్లు ఇప్పటికే చర్చించారు. ఒంగోలు ఎక్సైజ్‌ డిపో ఉన్న పేర్నమిట్ట, మార్కాపురం ఎక్సైజ్‌ డిపో ఉన్న ప్రాంతంలో ఒకటి రెండు రోజులపాటు ఎలాంటి కరోన పాజిటివ్‌ కేసులు తాజాగా వెలుగు చూడని పక్షంలో వాటిని కంటైన్‌మెంట్‌ జోన్‌ల పరిధి నుంచి తప్పించేందుకు అవకాశం ఉంది.   మంగళవారం కూడా దీనిపై ఒక నిర్ణయం వెలువడకపోవడంతో బుధవారం షాపులను తెరవలేమని, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడితే గురువారం నుంచి లేదా ఆ తరువాత రోజు నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

75 శాతం ధరల పెంపు..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో 40 రోజులపాటు షాపులు మూతపడిన విషయం విధితమే.  ఈ నేపథ్యంలో మందుబాబులు ఇష్టారీతిన మద్యం తాగకుండా ఉండేందుకు తొలుత 25 శాతం ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయినా క్యూ కట్టడంతో ధరలను ఏకంగా 75 శాతానికి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుతోపాటు త్వరలోనే 15 శాతం మద్యం షాపులను తగ్గించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  తాజా ఉత్తర్వుల ప్రకారం మరో 40 షాపులు తగ్గనున్నాయి. మద్యం ఒకేసారి ఆపకుండా క్రమంగా వాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు