నో స్టాక్‌!

9 Aug, 2018 12:05 IST|Sakshi

జిల్లా మద్యం కొరత

కంపెనీకి డబ్బు చెల్లించని ప్రభుత్వం

పూర్తిగా నిలిచిపోయిన సరఫరా

ఆందోళనలో వైన్‌షాపుల యజమానులు

దిక్కుతోచని మందుబాబులు

అనంతపురం సెంట్రల్‌: ఎప్పుడూ కళకళలాడే మద్యం షాపులు.. వెలవెలబోతున్నాయి. హుషారుగా వైన్స్‌ షాపునకు వెళ్లే మద్యం ప్రియులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. గోదాముల నుంచి సరఫరా లేకపోవడంతో జిల్లాలో ఏ మద్యం దుకాణంలో చూసినా ‘‘నో స్టాక్‌’’ బోర్డులే కనిపిస్తున్నాయి.  జిల్లాలో 245 మద్యం దుకాణాలు, 20 పైచిలుకు బార్లుండగా...అన్ని చోట్లా మద్యం కొరత ఏర్పడింది. మద్యం దుకాణాదారులు డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ స్టాకు మాత్రం సరఫరా కావడం లేదు. పదిరోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. మద్యం విక్రయాలను ఆన్‌లైన్‌ చేసిన ప్రభుత్వం..ఈ బాధ్యతలను ‘‘సీ–టెల్‌’’ కంపెనీకి అప్పగించింది. అయితే సదరు కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ.80 కోట్ల వరకూ బకాయి పడినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆ కంపెనీ 10 రోజులుగా మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో వైన్స్‌లకు మద్యం సరఫరా కాకా..అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా భారీగా పడిపోయింది.

మద్యం దుకాణాదారులకుఎదురుదెబ్బ
లక్షలాది రూపాయాలు పోసి మద్యం దుకాణాలను దక్కించుకున్న షాపుల యజమానులు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కమీషన్‌ తగ్గించడం వల్ల తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని గతంలోనే ఆందోళనలు చేపట్టారు.  వారం రోజుల పాటు మద్యం దుకాణాలు కూడా బంద్‌ చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. తాజాగా ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చి.. సదరు కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా మద్యం దుకాణాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేస్థాయిలో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు నచ్చిన బ్రాండ్‌ దొరక్కపోవడంతో పలు షాపులకుతిరిగి తెచ్చుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో ఆ మాత్రం స్టాక్‌  కూడా ఉండదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. 

తీవ్రంగా నష్టపోతున్నాం
టెండర్లలో మద్యం షాపుల తీసుకొని తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. 20 వేలకు పైగా నష్టపోతున్నాం. ప్రభుత్వానికి మేము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తే మద్యం షాపులు వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.  – రామలింగారెడ్డి, సింధూర వైన్స్, మద్యం యజమానులఅసోసియేషన్‌ నాయకులు 

మరిన్ని వార్తలు