మందుబాబులకు చుక్కెదురు..

29 Mar, 2018 13:52 IST|Sakshi

మూతపడ్డ 530 మద్యం దుకాణాలు,40 బార్లు

స్వచ్ఛందంగా తాళాలు వేసి బంద్‌

రెండో రోజూ నిరసనలతో హోరెత్తించిన మద్యం వ్యాపారులు

అమలాపురం టౌన్, రాజమహేంద్రవరం క్రైం:ట్రేడ్‌ మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు చేపట్టిన నిరసన రెండో రోజు బుధవారం మరింత ఉద్ధృతమైంది. తొలి రోజు జిల్లాలోని మూడు ప్రభుత్వ లిక్కర్‌ గోడౌన్ల నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపేసి ఆ గోడౌన్ల వద్దే నిరసనలు తెలిపిన మద్యం వ్యాపారులు రెండో రోజు నుంచి తమ తమ మద్యం దుకాణాలు, బార్లు మూసివేసి బంద్‌ పాటిస్తున్నారు. దీంతో జిల్లాలో బుధవారం 530 మద్యం దుకాణాలు, 40 బార్లు మూతపడ్డాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి ఇంతటి స్థాయిలో, ఇన్ని రోజులు ఎక్సైజ్‌ శాఖకు నిరసనలు వెల్లువెత్తడం ఇదే ప్రథమం. ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ మార్గమైతే, వాటి అమ్మకాల కోసం లైసెన్సులు పొందిన తమ లాభాలు, ఆదాయాలను మాత్రం ప్రభుత్వం హరిస్తోందని ఆ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుకాణాలు, బార్లు తెరుచుకోక, మద్యం దొరకక జిల్లా అంతటా మద్యం దుకాణాలు, బార్ల వద్ద బంద్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండో రోజూ కూడా జిల్లాలో సుమారు రూ.20 కోట్ల మద్యం సరఫరాకు, దాదాపు రూ. ఆరు కోట్ల మద్యం అమ్మకాలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరం, అమలాపురం, సామర్లకోటల్లో గల బేవరేజెస్‌ లిక్కర్‌ గోడౌన్ల కొనుగోళ్లు, బిల్లింగ్‌లు లేక పూర్తిగా మూతబడ్డాయి. మద్యం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. రాజమహేంద్రవరంలో మద్యం వ్యాపారులు సంబంధిత ఎక్సైజ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఈఎస్‌కు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అమలాపురంలో లిక్కర్‌ గోడౌన వద్ద వంటా వార్పు పెట్టి వినూత్న నిరసనకు తెర తీశారు. వ్యాపారులు అక్కడే వంటలు వండుకుని అక్కడే సామూహికంగా భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఇలా జిల్లా అంతటా మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు నిరసనలు హోరెత్తించారు. ఈనెల 31వ తేదీ వరకూ మద్యం దుకాణాలను మూసి వేసి బంద్‌ పాటించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. 31వ తేదీ వరకు రోజుకో తీరుతో నిరసనలను వినూత్నంగా నిర్వహించేందుకు జిల్లాలోని దాదాపు 600 మంది మద్యం లైసెన్సుదారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో బుధవారం మందు దొరకక కొందరు మందుబాబులు ఆందోళన చెందారు. నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలిసి కొందరు మందుబాబులు ముందుచూపుతో మంగళవారమే స్పందించారు. 

మరిన్ని వార్తలు