ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకుపోతుంది

19 Apr, 2014 04:17 IST|Sakshi
ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకుపోతుంది
  •     జగన్ ప్రభంజనం ముందు పార్టీలన్నీ ఖాళీ
  •      తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
  •  తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: సీమాంధ్రలో వీచే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాను గాలికి తెలుగుదేశం పార్టీ ఎంగిలిఆకులా కొట్టుకుపోతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని గాలివీధిలో శుక్రవారం వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు మౌలానా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన  బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబుతామంటూ గాలివీధిలోని ముస్లింలంతా ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెనకాడడని మండిపడ్డారు.

    తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను అష్టకష్టాలకు గురిచేశాడన్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. జనంలో జగనన్నకు ఉన్న ఆదరణకు మరో పదేళ్లపాటు చంద్రబాబు ప్రతిపక్షంలోనే ఉంటాడని స్పష్టం చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే మొదటి సంతకం పొదుపు సంఘాల్లోని రూ.20వేల కోట్ల మహిళా రుణాల మాఫీకోసం చేస్తారన్నారు.

    ‘అమ్మ ఒడి’ పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ.500ల చొప్పున వారిఖాతాలో వేసేందుకు రెండో సంతకం చేస్తారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు వంద రూపాయలకే విద్యుత్ సరఫరా అందిస్తారన్నారు. సీమాంధ్రలోని దాదాపు 50లక్షల మంది పేదలకు సొంత ఇల్లు కల్పిస్తారన్నారు. పేదలకు ఐదు లక్షల విలువచేసే వైద్యం ఉచితంగా అందించేందుకు జిల్లాకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారని తెలిపారు.

    జగనన్న నాయకత్వంలో తాను తిరుపతిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం తిరుపతిని రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రగల్బాలు పలికి చివరకు రూ.450 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను తిరిగి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నగరంలోని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే.బాబు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఎంవీఎస్.మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, హర్ష, గిరిధర్‌రెడ్డి, కట్టా గోపీయాదవ్, బొమ్మగుంట రవి, పెరుగు బాబూయాదవ్, ఎస్‌కే. ముస్తఫా, తాల్లూరి ప్రసాద్, తిమ్మారెడ్డి, కన్నయ్య, చలపతి, టైలర్ బాబు, రఫీఖాన్, అబ్బాస్, షఫీ, ఖాదర్ అహ్మద్, రవి ముదిరాజ్, చెలికం కుసుమ, గీత, పుణీత, గౌరి పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు