‘దారి’ దోపిడీ..!

8 Aug, 2015 01:38 IST|Sakshi
‘దారి’ దోపిడీ..!

- ఏకగ్రీవ పంచాయతీల్లో ఇష్టారాజ్యం
- ప్రభుత్వ ప్రోత్సాహక నిధులతో రోడ్ల నిర్మాణం
- మండల పరిషత్, ఇంజినీరింగ్  అధికారుల సహకారం
- నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌లు
వినుకొండ :
సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు దారి తప్పుతోంది. గ్రామాలభివృద్ధి కోసం జనాభా ప్రాతిపదికన  రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులు దారి మళ్లుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షలు ప్రోత్సాహంగా ఇచ్చే విధానాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7లక్షలు నిధులు మంజూరు చేశారు.

ఇక్కడ నుంచే అక్రమాల తంతు మొదలైయింది. కొంతమంది సర్పంచ్‌లు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టానుసారం నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు మండల పరిషత్, ఇంజినీరింగ్ అధికారుల సహకారం కూడా జత కలవడంతో వారి పని మరింత సులభం అయింది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇం దుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో గతంలో చేసిన పనులకు, సీసీ రోడ్లు నిర్మాణాలకు, బోరింగ్‌ల ఏర్పాటుకు నిధులు డ్రా చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు చేసిన అభివృద్ధి పనులకు బి ల్లులు మార్చుకుంటున్నారు. రెండు లక్షల రూపాయల వరకు చేసే పనులకు స్థానికంగా ఉండే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతి పాదిత నిధులు గ్రాంట్ చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఒకే వర్క్‌ను ముక్కలు ముక్కలు గా విభజించి స్థానికంగానే రెండు లక్షలలోపు అంచనాలు వేస్తూ పనులు ముగిస్తున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు వేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఏకగ్రీవ పంచాయతీలు ఇవే..
వినుకొండ మండల పరిధిలో  భారతాపురం, చాట్రగడ్డపాడు, గోకనకొండ, గోనుగుంట్లవారిపాలెం, హస్సానాయునిపాలెం, పెరుమాళ్ళపల్లి, నూజండ్ల మండల పరిధిలో గుర్రప్పనాయుడుపాలెం, జంగాలపల్లి, భూమాయిపాలెం, పెద్దవరం, పమిడిపాడు. ఈపూరు మండల పరిధిలో వనికుంట, గోపువారిపాలెం, చిట్టాపురం. బొల్లాపల్లి మండల పరిధిలో రేమిడిచర్ల. శావల్యాపురం మండలంలో ఇర్లపాడు, చినకంచర్ల, శానంపూడి, పోట్లూరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా 15 వేలలోపు ఉ న్న పంచాయతీలు కావటంతో ఒక్కో పంచాయతీకి రూ.7లక్షలు నిధులు మంజూరయ్యాయి.
 
నిబంధనలు ఇవీ..

పంచాయతీ పరిధిలో కనీసం 100 మీటర్లు వర కు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ఉపాధి హామీ నిధులు, 13వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలి. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలి, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే విడుదలైన నిధులు మొత్తం సీసీ రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది గతంలో వేసిన సీసీ రోడ్లకు బిల్లులు చేయించుకుంటున్నారు. రోడ్లను నాసిరకంగా నిర్మిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు.
 
- జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలు : 138
- నరసరావుపేట డివిజన్ పరిధిలో      : 46
- వినుకొండ నియోజకవర్గ పరిధిలో   : 18

 
నియమావళి ప్రకారమే ఖర్చు ..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహంగా విడుదల చేసిన నిధుల ను నియమాళి ప్రకారం ఖర్చు చేస్తున్నారు. సిమెంటు రోడ్ల నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులను కలిపి పనులు చేస్తున్నారు. గతంలో వేసిన రోడ్లకు బిల్లులు చెల్లించిన దాఖలా లేదు. నా దృష్టికి వస్తే పరిశీలిస్తా.
- విజయభాస్కరరెడ్డి, నర్సరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి

మరిన్ని వార్తలు