చెట్టు కింది నుంచి పక్కా భవనంలోకి!

9 May, 2015 05:01 IST|Sakshi

- ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు కదిలిన వాణిజ్యపన్నుల శాఖ

హైదరాబాద్:
రాష్ట్రం ఏర్పాటై 10 నెలలు గడిచినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై 'సాక్షి' రాసిన కథనానికి సర్కార్ స్పందించింది. 'చెట్టు కిందే చెక్‌పోస్టు' శీర్షికన గతనెల 21న ప్రచురితమైన వార్త కథనాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వెంటనే చెక్‌పోస్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలకు ఆదేశించింది. చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి లీజు పద్ధతిలో భూమిని తీసుకుంది.

ఏపీ సరిహద్దులుగా ఉన్న కర్నూలు జాతీయ రహదారిపై తుంగభద్ర చెక్‌పోస్టును మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరు గ్రామ పరిధిలో 6.23 ఎకరాలను ఇద్దరు వ్యక్తుల నుంచి వాణిజ్యపన్నుల శాఖ లీజుకు తీసుకుంది. విజయవాడ హైవేపై కోదాడ వద్ద 7.16 ఎకరాల భూమిని చిమిర్యాల గ్రామ పరిధిలో ముగ్గురు వ్యక్తుల నుంచి లీజుకు తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫీసు భవనం, ప్రధాన రోడ్డుకు సమానంగా  30 అడుగుల సీసీ గ్రావెల్ రోడ్డు, సీజ్ అయిన సరుకుల కోసం షెడ్, రూం, యాంటీ రూం కోసం పక్కా ఆర్‌సీసీ నిర్మాణం, కిచెన్, టాయ్‌లెట్లు, రెస్ట్‌రూమ్‌లను భూమి యజమానులే నిర్మించి ఇస్తారు. రెండు నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని వాణిజ్యపన్నుల అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు