అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా

27 Aug, 2014 02:51 IST|Sakshi
అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా

హిందూపురం : అధికార పార్టీ అండ ఉంటే చాలు.. కోర్టు పరిధిలో ఉన్న భూమైనా కేవలం 24గంటల్లో కబ్జా చేసేయవచ్చు. కోట్లు విలువజే సే భూమైతే చాటు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయచ్చు. హిందూపురం పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ భూమిని సోమవారం రాత్రికి రాత్రే ఓ రియల్టర్ కబ్జా చేయడమే ఇందుకు ఉదాహరణ. బాధితుడు లక్ష్మినరసారెడ్డి తెలిపిన మేరకు పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో వై.తిమ్మారెడ్డి, లక్ష్మినరసారెడ్డి, రమేష్‌రెడ్డి అన్నదమ్ముల పేరిట (సర్వే నంబరు 66/1ఎ1) 18.40 ఎకరాల పొలం ఉంది.
 
ఇందులో మూడోవంతు భాగం 6.40 ఎకరాల స్థలాన్ని బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్‌కు విక్రయించారు. వీరు ఆ స్థలాన్ని 2012లో వేరొకరికి విక్రయించారు. అయితే విక్రయ సమయంలో సర్వే నంబరు తప్పుగా రావడంతో బాధిత అన్నదమ్ములు కోర్టును ఆశ్రయించారు. నాటి నుంచి ఆ స్థలం కోర్టు పరిధిలో ఉంది. అయితే కాలక్రమేనా కోర్టు పరిధిలో ఉన్న 6.40ఎకరాల స్థలానికి అమాంతం ధర పెరిగిపోయింది. సుమారు రూ.10 కోట్లు విలువజేసే ఆ స్థలంపై బెంగుళూరుకు చెందిన రియల్టర్ టీ.నాగబాబు కన్ను పడింది. అంతే తడవుగా బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్ పేరిట బినామీ అగ్రిమెంట్ సృష్టించుకున్నాడు.
 
విషయం తెలుసుకున్న బాధిత లక్ష్మినరసారెడ్డి పదిరోజుల క్రితం మరోమారు కోర్టును ఆశ్రయించాడు. ఈ లోగా నాగబాబు గతంలో పనిచేసిన తహశీల్దార్ విశ్వనాథ్, ఓ కానిస్టేబుల్ సాయంతో నకిలీ పాసుపుస్తకాలు సృష్టించాడు. తన అనుచరగణంతో సోమవారం రాత్రి 6.40ఎకరాల భూమిని కబ్జా చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. రియల్టర్ ప్రస్తుత మంత్రికి బంధువని, అందుకే కోర్టు పరిధిలో ఉన్నా ఆ భూమిని కబ్జా చేశాడని బాధితుడు లక్ష్మినరసారెడ్డి సాక్షికి తనగోడు వెళ్లబోసుకున్నాడు. స్థల విషయమై కోర్టు స్పందించి ప్రస్తుత తహశీల్దార్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు.

మరిన్ని వార్తలు