పొత్తు.. ఇక చిత్తు!

15 Mar, 2015 02:47 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జిల్లాలో రోజురోజుకీ టీడీపీ-బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల వేడిని పెంచాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఎంతో సహాయం చేస్తోందని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తమ నేతలకు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలపై బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శల వర్షం ప్రారంభించారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ- బీజేపీల మధ్య రోజురోజుకీ అంతరం పెరిగిపోతోంది. ఈ వ్యవహారం కాస్తా చివరికి చినికి చినికి గాలివానలా మారి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తుకు బ్రేకులు పడే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
పెరుగుతున్న దూరం...!
 వాస్తవానికి ఎన్నికల సమయంలో బీజేపీకి జిల్లాలో పెద్దగా కేడర్ బలం లేదు. కేవలం అక్కడక్కడా కార్యక్రమాలు చేయడం మినహా పార్టీ నిర్మాణం బలంగా లేని పరిస్థితి. అయితే, ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో పలువురు నేతలు బీజేపీ వైపు చూడడం ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరారు. ఆయన చేరికతో జిల్లాలో బీజేపీ క్రమంగా  బలపడటం ప్రారంభించింది. అయితే, ఆయనతో పాటు బీజేపీలో చేరుతున్న పలువురు మండలస్థాయి, గ్రామస్థాయి నేతలకు టీడీపీతో మొదటి నుంచీ అంతగా సఖ్యత లేదు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని అటు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయి నేతలు పరోక్షంగా విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. దీంతో టీడీపీ వైఖరి బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. టీడీపీ నేతల వైఖరిపై జిల్లాలో కిందిస్థాయి కార్యకర్తల మనోభావాలను రాష్ట్ర నేతలకు జిల్లాస్థాయి బీజేపీ నేతలు వివరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇందులో భాగంగానే క్రమంగా టీడీపీపై బీజేపీ నేతల విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం ప్రారంభమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
మొదలైన విమర్శల వేడి...!
రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో టీడీపీపై బీజేపీ నేతలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా పాణ్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. తమ జోలికి వస్తే ఖబడ్డార్’ అని పాణ్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తీవ్రస్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ పథకంలో క్రెడిట్ అంతా కేంద్రానిదేనని ఆయన తేల్చి చెప్పారు.

కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ.. తమ పార్టీపైనే నిందలు వేస్తే సహించేది లేదని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు కూడా మండిపడుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం చివరకు పొత్తు విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.
 
మునిసిపోల్స్‌లో పొత్తు చిత్తేనా?
కర్నూలు కార్పొరేషన్‌కు ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే నెలలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ-బీజేపీల మధ్య ముదురుతున్న పోరు చివరకు కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు అయ్యేందుకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ముస్లింలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నందున.. బీజేపీతో పొత్తు నష్టం చేకూరుస్తుందనేది జిల్లా టీడీపీ నేతల అంతర్గత అభిప్రాయంగా ఉంది. అందువల్లే కార్పొరేషన్ ఎన్నికల వరకు బీజేపీపై పైపై విమర్శలు కురిపిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమేననేది ఇరు పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు