నోటిఫికేషన్ జారీతో రైతుకు గుండెపోటు

21 Sep, 2015 01:09 IST|Sakshi

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : బందరు పోర్టు నిర్మాణం, అనుబంధ పరిశ్రమల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌తో రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భూములు పోతే తమ జీవనం సాగేదెలా అనే వేదన వారిని పీడిస్తోంది. వ్యవసాయమే ఆధారంగా బతికే పలువురి జీవితాలలో నోటిఫికేషన్ చీకటి నింపుతోంది. భూములు పోతే తమ జీవితాలు బజారుపాలేనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన ఓ రైతు ఆదివారం గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాపాయస్థితిలో ప్రస్తుతం మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బందరు మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన రైతు కాటం అచ్యుతరామయ్యకు పోతేపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 121-3సిలో 80 సెంట్లు, 122-4లో 60 సెంట్లు, 158-2జిలో భూములు ఉన్నాయి. తాతల కాలం నాటి నుంచి ఉన్న భూమినే నమ్ముకుని వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్యతో పాటు ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లల చదువులు పూర్తి కాగానే ఉన్న భూమిని అమ్మి మంచి పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే యేడాది పెద్ద కుమార్తె వివాహం చేయాలనే నిశ్చయంతో ఉన్నాడు.

 పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలని మనోవేదన
 ఈ నేపథ్యంలో గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ అచ్యుతరామయ్య గుండెలను పిండేసింది. నోటిఫికేషన్‌లో తన మూడు సర్వే నెంబర్లలో ఉన్న భూములు ఉన్నాయని తెలియడంతో ఆందోళన చెందాడు. అప్పటి నుంచి రామయ్య ఇంటి దగ్గరే దిగాలుగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ఆరోగ్య సమస్య తలెత్తడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు, బంధువులు విజయవాడలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. వైద్యులు ఆందోళనతో కొద్దిపాటి అనారోగ్యానికి గురవుతున్నాడని చెప్పడంతో బంధువులు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకువచ్చారు.

అయినప్పటికీ భూములు పోతే తమ కుమార్తెల పెళ్లిళ్లు ఏవిధంగా చేయాలి, ఉన్న ఒక్క కొడుక్కి ఏమి ఇవ్వాలి అంటూ భార్య వద్ద అచ్యుతరామయ్య పదేపదే బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అచ్యుతరామయ్యకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామయ్య ఐసీఈయులో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామంలోని పలువురు రైతులు రామయ్యను పరామర్శించిన ఆందోళన చెందవద్దని, భూములు కోల్పోకుండా తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు