అధికార పార్టీ ఆదేశాలతోనే అరెస్టులు

21 Apr, 2016 01:01 IST|Sakshi

వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని



జగ్గయ్యపేట అర్బన్ : వైఎస్సార్  సీపీకి చె ందిన సానుభూతి పరుల వ్యాపారం అనే దుగ్ధతతోనే అధికారపార్టీ వారు పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయిస్తూ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉదయభాను విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్ తన్నీరు అక్రమ అరెస్ట్ అప్రజాస్వామ్యమన్నారు. అధికార పార్టీ నేతలు రెండేళ్లుగా  నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం సిటీ కేబుల్ తెలుగుదేశం వారికి సంబంధించింది కావడంతో తమ పార్టీవారి ప్రకటనలు తీసుకోవడంలేదని, దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన కొందరికి ఉపాధికోసం  కోటి రూపాయల వ్యయంతో  ఆరు నెలల క్రితం సిటీకేబుల్ ప్రసారాలను ప్రారంభించామన్నారు. దీనిని సహించని అధికార పక్షం వారు తమ కేబుల్ వైర్లు కత్తిరించడం, ప్రసారాలకు ఆటంకం కలిగిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.  సాంకేతిక పరంగా టౌన్ వరకే పెట్టామని, హైదరాబాద్ స్టేట్ కేబుల్ వారి మౌఖిక ఆదేశాలతో వారం క్రితం దేచుపాలెం, మంగొల్లు, తొర్రగుంటపాలెం, బలుసుపాడు గ్రామాలలో కనెక్షన్లు ఇచ్చామని, ఇది సహించలేక రూరల్‌లో కూడా ప్రసారం చేస్తున్నారని జెమినీ వారితో ఫిర్యాదు చేయించారన్నారు. దీంతో 24 గంటలలోనే కనెక్షన్లు తొలగించామని, ఇది చెప్పకోతగ్గ ఆర్థిక, పైరసీ వంటి నేరం కానప్పటికీ, ఫిర్యాదుదారుడు ఫిర్యాదు వెనక్కు తీసుకుంటామని చెప్పినప్పటికీ 420 కింద అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

 
డీఎస్పీపై ఫిర్యాదు చేస్తాం
నందిగామలో డీఎస్పీ రాధేష్‌మురళి వంటి అధికారిని ఇప్పటి వరకు చూడలేదన్నారు.  న్యాయాన్ని,ధర్మాన్ని కాపాడవలసిన అధికారి టీడీపి నాయకుడిగా వ్యవహరిస్తూ తమ పార్టీని అణగదొక్కాలని చూడటం  విచారకరమన్నారు. టీడీపీ నేతల ఇసుక మాఫియా వారిని పట్టించినప్పటికి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. డీఎస్పీ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు