‘ఉపాధి’ పని చేసినా పస్తులే

12 Jul, 2014 01:08 IST|Sakshi
‘ఉపాధి’ పని చేసినా పస్తులే

రంగంపేట  : ఆరుగాలం కష్టించినా వేతనాల్లేక ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. తపాలా పాస్‌పుస్తకాలు లేక కొందరికి, పుస్తకాలున్నా మరి కొందరికి వేతనాలు పడలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక వారు దిక్కులు చూస్తున్నారు. మండలంలో సుమారు 200 మందికి పైగా ఉపాధి కూలీలకు తపాలాశాఖ పాస్‌పుస్తకాలు లేవు. సుమారు రూ. 20 లక్షల ఉపాధి పనుల సొమ్ము విడుదలైనా ఆ సొమ్ము మాత్రం కూలీలకు అందలేదు.  మండలంలోని 16 గ్రామాల్లో సుమారు రూ. కోటితో 42 పనులను చేపట్టారు.

తపాలా పాసుపుస్తకాలు ఉన్న కూలీలకు ఆరు వారాల కూలి రావాల్సి ఉండగా రెండు వారాలకు మాత్రమే వచ్చిందని, ఆమొత్తం సుమారు రూ. 5 లక్షలు వారి ఖాతాలకు జమచేస్తున్నామని ఏపీఓ యు. భ్రమరాంబ తెలిపారు. ఇంకా రూ. 20 లక్షల వరకు బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా కనీసం 200 మందికి పాస్‌పుస్తకాలు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. తక్షణమే పాసుపుస్తకాలను జారీ చేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చామని, ఇంకా విడుదల చేయలేదని ఆమె చెప్పారు. దీనిపై తపాలాశాఖ ఉన్నతాధికారులు స్పందించి కనీసం 200 పాస్‌పుస్తకాలు రంగంపేట మండలానికి విడుదల చేయాలని ఉపాధికూలీలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు