ఇసుక దుమారం!

16 Jun, 2015 04:49 IST|Sakshi
ఇసుక దుమారం!

- బిల్లులు లేకుండా తరలింపును అడ్డుకున్న పోలీసులు
- ర్యాంప్‌కు అనుమతి ఉందని చెబుతున్న వెలుగుసిబ్బంది
- బిల్లులు జారీ చేయకపోవడంపై అనుమానాలు
చోడవరం:
ఇసుకకు చిరునామా అయిన మండలంలోని గజపతినగరంలో సోమవారం ఇసుక తరలింపు వ్యవహారం దుమారం రేపింది. బిల్లులు లేకుండా ఇసుకను తరలించుకుపోతుండటంతో సుమారు 18లారీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. మండలంలోని గజపతినగరం వద్ద శారదానదిలో ఇసుక ర్యాప్ నిర్వహణకు గత నెలలో ఇక్కడి డ్వాక్రా సంఘాలకు డీఆర్‌డీఏ అధికారులు అప్పగించారు. అప్పట్లో స్థానికులు దీనిని అడ్డుకున్నారు. మళ్లీ సోమవారం ఉదయం సుమారు 20పైగా లారీలు ఇసుక ర్యాప్ వద్దకు వచ్చి రోడ్డు పక్కనే వేసి ఉన్న ఇసుక ఎత్తుకొని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి.

నదిలో ఉండాల్సిన ఇసుక రోడ్డుపైకి కుప్పలుగా తరలించడం,  ఎటువంటి అనుమతి లేకుండా లారీల్లో తీసుకెళ్లడంపై స్థానికులుపోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చోడవరం పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ కిరణ్‌కుమార్, ఎస్‌ఐ రమణయ్య సిబ్బందితో హుటాహుటిన  వచ్చి విచారణ చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి డీఆర్‌డీఏ శాఖకు డబ్బులు చెల్లించి, బిల్లులు పొందామని లారీ డ్రైవర్లు పోలీసులకు చెప్పారు. అయితే స్థానిక ర్యాంప్ నిర్వహణ కమిటీ ఇచ్చే బిల్లులు లేకుండా ఇసుకను ఎలా లోడ్‌చేశారని వారిని పోలీసులు ప్రశ్నించారు. వాస్తవానికి అనుమతి ర్యాంప్‌ల వద్ద నేరుగా నదిలోకే లారీలు వెళ్లి ఇసుకను లోడ్ చేసుకోవాల్సి ఉంది.

ఇక్కడ అలా కాకుండా ఎడ్లబళ్లతో ఇసుకను నదిలోంచి రోడ్డుపక్కకు కుప్పలువేసి లారీలపై ఎత్తుతున్నారు. అసలు ఈ విధానానికి ఎవరు అనుమతి ఇచ్చారని ఎడ్లబళ్ల వారిని సీఐ ప్రశ్నించగా వెలుగుసిబ్బంది, ర్యాంప్ నిర్వహణ కమిటీ చెప్పడంతో ఇసుకను ఎడ్లబళ్లతో తెచ్చి కుప్పలు వేశామని బళ్లవారు తెలిపారు. 3200 క్యూబిక్‌మీటర్ల ఇసుకను గజపతినగరం ర్యాంప్ వద్ద నదిలో తవ్వకాలకు డీఆర్‌డీఏ అధికారుల అనుమతి ఉందని, ఇప్పటికే 2700 క్యూబిక్‌మీటర్ల ఇసుక రవాణాకు ఆన్‌లైన్‌లో అనుమతి కూడా ఇచ్చారని ర్యాంప్ పర్యవేక్షకుడు వెలుగు సీసీ సత్యనారాయణ చెప్పారు.

అయితే ర్యాంప్ ఎక్కడ నిర్వహించాలి, ఏ రేవు వద్ద నదిలోకి లారీలను దించాలనే అంశాలపై స్పష్టత, రేవు ఏర్పాటు కాకుండానే ఇసుక తరలించేందుకు గుంపులుగుంపులుగా లారీలు రావడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఆర్‌డీఏ అధికారులు, స్థానిక ఇసుక మాఫీయా తమ వ్యాపారాల కోసం పొంతనలేకుండా తవ్వకాలు చేస్తున్నారనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. బిల్లులు ఇచ్చేవరకు తాత్కాలికంగా ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని పోలీసులు వెలుగు సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత బిల్లులు తెచ్చి లారీలకు సీసీ సత్యనారాయణ ఇవ్వడంతో లారీలను పోలీసులు వదిలిపెట్టారు.

మరిన్ని వార్తలు