'సాక్షి’ విలేకరిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

25 Mar, 2014 02:33 IST|Sakshi

వ్యతిరేక వార్తలు రాస్తే పెట్రోల్ పోసి తగలెడతానంటూ బెదిరింపు

 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు ‘సాక్షి’ స్థానిక విలేకరి జీవీవీ సత్యనారాయణపై సోమవారం సాయంత్రం విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ‘నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయంటే నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతా..’ అంటూ బెదిరించారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చూసేందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే అధికారులతో మంతనాలు ప్రారంభించారు.


అయితే అందుకు అవకాశం లేదని ఎంపీడీవో పి.వసంతమాధురి, ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ‘మీతో రహస్యంగా మాట్లాడాలి రండి’ అని ఎన్నికల అధికారిని ఎమ్మెల్యే కోరారు. బయటకు వచ్చిన వారిని అక్కడే ఉన్న ‘సాక్షి’ విలేకరి ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, రామారావు అతనిపై అమానుషంగా దాడి చేశారు. ‘ఎంపీటీసీ స్థానానికి మా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చేసుకుందామని మా తంటాలు మేం పడుతుంటే ఫొటోలు తీస్తావా..’ అంటూ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దారు. అధికారులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అతి కష్టంగా బయటకు పంపారు. సత్యనారాయణ ఎంపీడీవో కార్యాలయంలోనే ఉండిపోగా, ఎమ్మెల్యే ‘బయటకు రా నా కొడకా.. ఇక్కడే చంపేస్తా’ అని అరుస్తూ మెయిన్ గేటు వద్దే కాపు కాశారు.

విలేకరి ఇచ్చిన సమాచారంతో సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో సత్యనారాయణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు దాఖలు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు