గిరిజనుడిపై పోలీసుల దాష్టీకం

19 Jul, 2017 07:06 IST|Sakshi
గిరిజనుడిపై పోలీసుల దాష్టీకం

-  తన కళ్లెదుటే బూట్‌ కాళ్లతో తొక్కిపెట్టి..
- కొట్టారని బాధితుడి భార్య ఆరోపణ   

గూడూరు: కట్టుకథ చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి ఓ గిరిజనుడిని పోలీసులు చితకబాది మంచానపడేలా చేసిన సంఘటన గూడూరు రూరల్‌ పరిధిలోని నెల్లటూరు గిరిజనకాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు గూడూరు రూరల్‌ మండలం నెల్లటూరు గిరిజనకాలనీకి చెందిన నిడిగంటి శ్రీనివాసులు, అతని భార్య శ్యామలలను సోమవారం రాత్రి గూడూరు రూరల్‌ పోలీసులు ఓ కట్టుకథ చెప్పి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఇంతకీ పోలీసులు చెప్పిన కట్టు కథేంటంటే శ్రీనివాసులు భార్య శ్యామల చిన్నాన నాగార్జున ఎవరిదో ఉంగరం దొంగిలించాడని, దాన్ని తీసుకొచ్చి వారి చేతికిచ్చాడంటూ క«థ అల్లారు. ఆ కథ చెప్పి గిరిజన దంపతులను రాత్రి 9 గంటల ప్రాంతంలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీరా స్టేషన్‌కు తీసుకొచ్చాక శ్రీనివాసులు భార్య శ్యామలది చిల్లకూరు కావడంతో ఆమె తండ్రి అయిన గడ్డం లక్ష్మయ్య ఏదో కేసులో నిందితుడని, అతనెక్కడున్నాడంటూ శ్యామలను గదమాయించారు.

శ్రీనివాసులును కింద పడుకోబెట్టి కానిస్టేబుళ్లు బూటు కాళ్లతో తొక్కిపెట్టగా ఎస్సై అతి దారుణంగా తన కళ్లెదుటే లాఠీతో కాళ్లు పగిలేలా చితకబాదారని శ్యామల కంటతడిపెట్టింది. తన తండ్రి కేసులో ఉంటే పోలీసులు చిల్లకూరుకు వెళ్లి వాళ్లను విచారించాలే గానీ, ఎలాంటి సంబంధం లేని తన భర్తను కిరాతకంగా కొట్టి హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ దెబ్బలకు తన భర్త కనీసం నడిచే స్థితిలో కూడా లేడని ఆమె రోధించింది. తన భర్త కూలిపనులకెళ్తేనే తాము బతకాలని, ఏ పాపం తెలీని తన భర్తను అన్యాయంగా చితకబాదారని కన్నీరుమున్నీరయింది.

ఈ విషయం తమ గ్రామపెద్ద భాస్కర్‌రెడ్డికి చెప్పానని, ఆయన చెప్పినా కూడా వినకుండా మీ మామ ఎక్కుడున్నాడురా.. నీకు తెలుసంటూ మళ్లీ కొడుతూనే ఉన్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. తమను అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి పంపారని వాపోయింది. ఈ విషయంపై రూరల్‌ ఎస్సై బాబీని వివరణ కోరగా ఓ కేసులో నిందితుడైన శ్రీనివాసులు మామ ఆచూకీ కోసం అతన్ని తీసుకొచ్చామని, అతన్ని చూపించడంతో తిరిగి పంపేశామని తెలిపారు. 

మరిన్ని వార్తలు