మహిళ సజీవ దహనం

2 Apr, 2019 08:22 IST|Sakshi
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు

సాక్షి, తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలోని కాలనీ వద్ద సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది. తాళ్లపూడి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిక్కాల సోమాలమ్మ (32) ఉదయం 9.30 సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి మంటలు ఎగసి పడ్డాయి. ఒంటికి నిప్పంటుకోవడంతో ఆమె మంటల్లో కాలిపోయినట్టు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యిందా లేక గ్యాస్‌ వల్ల ప్రమాదం జరిగిందా మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి బంగాళా పెంకుటిల్లుకు మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వారు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు.

అయితే అప్పటికే సోమాలమ్మ పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందడం జరిగింది. శరీరభాగాలు మొత్తం కాలిపోయాయి. సంఘటనా స్థలంలో బంధువుల రోదనలతో మారుమోగింది. మృతురాలి భర్త చిక్కాల శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లిక తాళ్లపూడిలోని కళాశాలలో డీఈడీ చదువుతున్నారు. రెండో కుమార్తె తేజస్వి స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. తాళ్లపూడి ఎస్సై కేవై దాస్‌ సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు. తహసీల్దార్‌ బి.దేవి, రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు.
 

మరిన్ని వార్తలు