కథలు చెప్పకండి

11 Aug, 2018 11:40 IST|Sakshi
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాల నిర్వాహకులను ప్రశ్నిస్తున్న జాయింట్‌ డైరెక్టర్‌ వాణిశ్రీ

బాలింతలు ఆసక్తి     చూపడం లేదా?

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల నిర్వాహకులపై ఆగ్రహం

మూడు వాహనాలు రద్దు చేసిన జాయింట్‌ డైరెక్టర్‌ వాణిశ్రీ

అనంతపురం న్యూసిటీ: ప్రసవానంతరం బాలింతను, చంటిబిడ్డను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ఆస్పత్రి ఆవరణలోనే అధిక సంఖ్యలో ఉండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఉమెన్, చైల్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాణిశ్రీ ‘జీవీకే గ్రూపు’ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె అనంతపురం సర్వజనాస్పత్రిని పరిశీలించారు. ప్రసవాల నివేదికను పరిశీలించి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలపై ఆరా తీశారు. అసలు చాలా వాహనాలను వాడటమే లేదని తెలిసింది. అక్కడి నుంచి సీనియర్‌ రెసిడెంట్స్‌ హాస్టల్‌వద్దకు వెళ్లిన ఆమెకు ఆరుబయట ఆరువాహనాలు కనిపించాయి. డ్రైవర్ల లైసెన్స్, బ్యాడ్జీలను పరిశీలించారు. డ్రెస్‌కోడ్‌ లేకపోవడంపై మండిపడ్డారు.

మధ్యాహ్నం 12 గంటలవుతున్నా వాహనాలన్నీ ఇక్కడే ఉంటే ఎలా అంటూ ప్రశ్నించడంతో.. ‘బాలింతలు వాహనాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు’ అని వాహనాల నిర్వాహకుడు సమాధానమిచ్చారు. పేదలు డబ్బు ఖర్చు చేసుకోవాలని అనుకోరు.. కథలు చెప్పకండి అంటూ జాయింట్‌ డైరెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందేనంటూ ఆదేశించారు. నిర్వహణ సరిగా లేనందున మూడు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను రద్దు చేశామని తెలిపారు. అంతకు ముందు జాయింట్‌ డైరెక్టర్‌ ఆస్పత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఆర్‌ఎంఓతో సమావేశమయ్యారు. ప్రసవాలు బాగానే చేస్తున్నారని, డిశ్చార్జ్‌ అయ్యాక తల్లీబిడ్డలను గమ్యస్థానాలకు చేర్చకపోతే మిగతా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే కాకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలు 108కు ఫోన్‌ చేసి, సేవలు వినియోగించుకోవాలన్నారు. 

బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదు
బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌కు జాయింట్‌ డైరెక్టర్‌ సూచించారు. డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ బరువు కారణంగానే శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వీటిని అధిగమించాలంటే గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ జ్యోత్స్న, విశ్రాంత డీఐఓ డాక్టర్‌ పురుషోత్తం, పీఓడీటీటీ డాక్టర్‌ సుజాత, ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మ, మేనేజర్‌ శ్వేత, గ్రేడ్‌ 2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ కెజియాపాల్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు