నా భర్తను హత్య చేశారు... న్యాయం చేయండి

21 Nov, 2017 06:18 IST|Sakshi

పోలీస్‌ ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన బనగానపల్లెకు చెందిన నిర్మల  

కర్నూలు :     తన భర్త నాగరాజును గత నెల 25వ తేదీన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హత్య చేసి శవాన్ని కనిపించకుండా చేశారని, దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని బనగానపల్లె పట్టణానికి చెందిన నిర్మల ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. 94407 95567 సెల్‌ నంబర్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. 

ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి నేరుగా వచ్చి కలసిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోస్పాడు మండలం పసులవాడు గ్రామానికి చెందిన తమ కుటుంబం 20 ఏళ్లుగా బనగానపల్లెలో ఉంటుందని, తన భర్త నాపరాయి బండల వ్యాపారం చేసేవాడని నిర్మల ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బనగానపల్లెకు వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని నిర్మల   కలిసి తన సమస్య  చెప్పుకుంది. ఆయన సూచన మేరకు సోమవారం కుటుంబ సభ్యులతో  ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకుంది.  

ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో మరి కొన్ని...  
వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బనగానపల్లె మండలం బీరపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని ఆమె వేడుకున్నారు.  

♦ భార్య ఆరోగ్యం సరిగా లేనందున పొలాన్ని అమ్మి వైద్యచికిత్సలు చేయించేందుకు ప్రయత్నిస్తుండగా కుమారులు అడ్డుకుంటున్నారని చాపిరేవుల గ్రామానికి చెందిన మద్దిలేటి  ఫిర్యాదు చేశారు. ఆరుగురు పిల్లలున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. 

♦ కొందరు తమ ఇళ్లస్థలాలను దౌర్జన్యంతో ఆక్రమించుకున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సుజాత, బతుకమ్మ, జాన్, చిట్టెమ్మ, రాహేలమ్మ  ఫిర్యాదు చేశారు.  

♦ వెల్దుర్తిలోని కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట, మట్కా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డయల్‌ యువర్‌ ఎస్పీ, ప్రజాదర్బార్‌ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీ బాబుప్రసాద్, వినోద్‌కుమార్, నజీముద్దిన్, సీఐ పవన్‌కిషోర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు