చికిత్స కోసం వెళుతూ అనంతలోకాలకు...

3 Jul, 2015 01:32 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలోమహిళ మృతి
ఇద్దరికి గాయాలు

 
గూడూరు : అనారోగ్యానికి గురైన ఓ మహిళ చికిత్స కోసం భర్త, తమ్ముడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతూ ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చిట్టిగూడూరులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొత్తతుమ్మలపాలెం గ్రామానికి చెందినపందుల భాగ్యం (45)  కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. స్థానికంగా ప్రథమ చికిత్స చేస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో పామర్రులో ఉంటున్న తన సోదరుడు పాము బాలకు సమాచారం అందించింది. బుధవారం రాత్రి తుమ్మలపాలెం గ్రామానికి చేరుకున్న బాల గురువారం ఉదయం తన అక్క భాగ్యాన్ని ఆమె భర్త సుందరరావులను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పర్ణశాల మీదుగా విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై మచిలీపట్నం వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో చిట్టిగూడూరు సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న మట్టి ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బైక్‌ను ఢీకొంది.

ఈ ఘటనలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పల్టీ కొట్టగా అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యం తలకు తీవ్రగాయాలు కావడంతో పాటు ట్రాక్టర్ చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న బాలకు, సుందరరావులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భాగ్యం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సుందరరావు, బాలలు తలకు, చేతులకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు.

 భాగ్యం మృతి వార్త తెలియగానే కొత్త తుమ్మలపాలెం గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసే సుందరరావు, భాగ్యాలకు అనుకోని విపత్తు ఏర్పడటంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఏఎస్‌ఐ కిష్వర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ నిర్వహించారు.

మరిన్ని వార్తలు