మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది!

27 Aug, 2019 10:56 IST|Sakshi

అంబులెన్స్‌ వాహనంలోనే మహిళకు పురుడు

తల్లీబిడ్డలను క్షేమంగా ఆస్పత్రిలో చేర్చిన వైనం

సాక్షి, గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నడిరోడ్డు మీద పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 వాహనంలో పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందక పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వాహనాలు..  ఆపదలో ఉన్న ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. అలాంటి 108 వాహనాలను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆపదలో ఉండి ఎవరైనా 108కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని, టైర్లలో గాలి లేదని సమాధానం వచ్చేది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం 108 వాహనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ప్రమాదంలో ఉన్నవారికి క్షణాల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు.

తాజాగా కృష్ణాజిల్లా  గన్నవరంలో ఓ మహిళ నడిరోడ్డు మీద ప్రసవ వేదన పడటం చూసిన స్థానికులు 108కు కాల్‌ చేశారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది మహిళ పరిస్థితిని చూసి మానవత్వంతో తమ అంబులెన్స్‌ వాహనంలోనే పురుడుపోశారు. ఉంగుటూరు మండలం కొయ్యగూరప్పాడుకు చెందిన ఇట్ల సంధ్య నిండు గర్భిణి.  పొలాల్లో కూలి పనులు చేసుకునే ఆమెకు సోమవారం రాత్రి భర్త ఇంట్లోలేని సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆటో ఎక్కి గన్నవరం సినిమా హాల్ సెంటర్‌లో దిగి ప్రభుత్వ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. ఇది గమనించి స్థానికులు 108కు కాల్ చేయగా.. 108 సిబ్బంది నాయుడు, సాయిబాబు సకాలంలో అక్కడకు చేరుకున్నారు. పురిటినొప్పులు ఎక్కువకావడంతో తమ అంబులెన్స్‌ వాహనంలోనే ఆమెకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 108 సిబ్బంది సకాలంలో వచ్చి తల్లీబిడ్డలను రక్షించడంతో 108 సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు