అయ్యో పా'ప'ము..!

16 Dec, 2019 10:32 IST|Sakshi
మృతి చెందిన మహిళ

రోడ్డుపైకొచ్చిన పాము

ఆగిన బైకును  ఢీకొన్న మరొక బైక్‌

బైక్‌పైనుంచి ఎగిరిపడ్డ మహిళ మృతి

అనంతపురం, తాడిమర్రి : పెద్ద కుంటుంబం..పిల్లా, పెద్దా అంతా శుభకార్యంలో పాల్గొన్నారు. అప్పటి దాకా బంధువులతో సరదాగా గడిపారు.. సందడి చేశారు.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. ఎవరి ఊళ్లకు వాళ్లు బయల్దేరారు. అప్పటి వరకు ద్విచక్రవాహనం వెళ్లాల్సిన వేగంతో వెళ్తోంది. ఉన్నట్లుండి దారికి అడ్డంగా పెద్ద పాము వెళ్తోంది. పాముపై బైక్‌ ఎక్కడ ఎక్కుతుందోనని వేగం తగ్గించాడు వాహనదారుడు.. అంతే.. ఆ వెనకే అతివేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ముందున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనకవైపున కూర్చున్న మహిళ ఎగిరి కింద పడింది. తలకు తీవ్రగాయమైంది. 108 వాహనంలో ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన తాడిమర్రి మండలం కునుకుంట్ల ప్రాంతంలో జరిగింది.

బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామానికి చెందిన మదనాపు శంకరయ్య భార్య పద్మావతి (50), కుమారుడు అశోక్‌లు ద్విచక్ర వాహనంలో నార్పల మండలం గూగూడులో ఆదివారం జరిగిన శుభకార్యానికి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగివచ్చేటపుడు పద్మావతి పుట్టినిల్లు కునుకుంట్లకు వెళ్లి అక్కడి వారిని పలకరించారు. అనంతరం తిరిగి పోట్లమర్రికి బయల్దేరారు. కునుకుంట్ల గ్రామం దాటగానే రోడ్డుపై పాము వెళ్తోంది. దీన్ని గమనించిన అశోక్‌ బైక్‌ వేగం తగ్గించాడు. అయితే వెనకాల అతివేగంతో వస్తున్న మరో బైక్‌ వీరిని ఢీకొంది. దీంతో తల్లి, కుమారుడు ఎగిరి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో పద్మావతి చెవులు, ముక్కుల్లో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పద్మావతికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా