పేదరాలిని కాటేసిన పిడుగు

20 Aug, 2018 06:40 IST|Sakshi
లక్ష్మి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు , పొలంలో లక్ష్మి మృతదేహం

పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి రైతు కూలీ దుర్మరణం

పొట్నూరు గ్రామంలో తీవ్ర విషాదం

విశాఖపట్నం ,పద్మనాభం(భీమిలి): రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు... ఆసరాగా సెంటు భూమి కూడా లేదు... అయినప్పటికీ కష్టాన్నే నమ్ముకుని భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ తమ ఆశల దీపాలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారికి ఉజ్వల భవిష్యత్‌ అందించాలనుకుంటున్న వారిపై విధి కన్నెర్ర చేసింది. కర్కశంగా దాడి చేసి పిడుగు రూపంలో మృత్యు పంజా విసిరింది. ఆ ధాటికి భార్య మృతిచెందడంతో భర్త, పిల్లలిద్దరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ హృదయవిదారకర దుర్ఘటన పద్మనాభం మండలంలోని పొట్నూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొట్నూరు గ్రామంలో సంభంగి సూరినాయుడు, లక్ష్మి కూలి పనులు చేసుకుని నివసిస్తున్నారు.

వీరికి నీరజ, నిహారిక అనే ఏడేళ్ల కవల పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ముత్యాలమ్మ పొలం సమీపంలో అవనాపు శ్రీనుకి సంబంధించిన భూమిలో వరి ఉడుపు కోసం తోటి కూలీలతో కలిసి లక్ష్మి ఆదివారం ఉదయం వెళ్లింది. ఈ క్రమంలో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడడంతో లక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మిగతా వారందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.విషయం తెలుసుకని మృతురాలి భర్త, కుమార్తెలిద్దరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై సూరినాయుడు పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు