కబలించిన కరెంట్

14 Jan, 2014 00:56 IST|Sakshi

బనగానపల్లెటౌన్, న్యూస్‌లైన్ : జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ మహిళను పని చేస్తున్నచోటే కరెంట్ కబలించింది. షాక్ తగిలిన మరుక్షణమే ఆమె విగతజీవిగా మారింది. తీగలకు వేలాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బనగానపల్లె 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీ జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న వాటర్‌ప్లాంట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీటిని అందించేందుకోసం బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం తలపెట్టారు.

నిర్మాణ పనులు పూర్తి కావడంతో తెలుగుపేటకు చెందిన వెంకటలక్ష్మమ్మ, రమణమ్మ, బి.లక్ష్మిదేవి సోమవారం సున్నం వేసేందుకు వెళ్లారు. ప్లాంట్‌పై సున్నం వేస్తుండగా పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి లక్ష్మిదేవి(38) అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్న కూలీలు ప్రాణభయంతో పరిగెత్తారు. తీగలకు ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసిననప్పటికీ  అవి విద్యుత్ తీవ్రతను నిరోధించలేకపోయాయి. ఫలితంగా ఓ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

ప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధిత కుటుంబీకులను ఓదార్చారు. తీగలపై ఉన్న మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త శ్రీనివాసులు స్థానిక ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగం పర్మినెంట్ కావడంతో నంద్యాలకు బదిలీ అయ్యాడు. లక్ష్మిదేవి మరణంతో కూతురు మౌనిక, కుమారుడు అశోక్‌తోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి.

>
మరిన్ని వార్తలు