ఇంజక్షన్‌ వికటించి మహిళ మృతి

17 Apr, 2018 07:19 IST|Sakshi
నాగమణి మృతదేహం

గొడిచర్ల పీహెచ్‌సీలో ఘటన

నక్కపల్లి(పాయకరావుపేట) : గొడిచర్ల పీహెచ్‌సీలో ఇంజక్షన్‌ వికటించి ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలుఇలా ఉన్నాయి. ఎస్‌.రాయవరం మండలం గోకుల పాడుకు చెందిన కొఠారు నాగమణి(24) తన స్నేహితురాలు నానేపల్లి విజయతో కలసి సోమవారం ఉదయం గొడిచర్ల పీహెచ్‌సీకి వచ్చింది. తనతో తెచ్చుకున్న ఇంజక్షన్‌ను  చేయాలని అక్కడ ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్‌ రూపను కోరింది. అయితే  ఇంజక్షన్‌ చేసేందుకు రూప నిరాకరించింది. బతిమాలడంతో ఆమె నాగమణికి ఇంజక్షన్‌ చేసింది. కొద్దిసేపటికి నాగమణి సృహతప్పిపడిపోయింది.  వెంటనే రూప, నాగమణి స్నేహితురాలు విజయ ఆమెకు మంచినీరు పట్టి, సపర్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించిందని తనకు  విజయ ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చిందని మృతురాలికి వరుసకు సోదరుడైన లంక రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.

మృతురాలి ఒత్తిడి మేరకు తాను ఇంజక్షన్‌ చేసినట్టు రూప చెబుతోంది.అయితే ఇంజక్షన్‌ను మక్కకు చేయాల్సి ఉండగా చేతికి చేయడం వల్లే    వికటించి మరణించినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి నాగనరేంద్ర తెలిపారు.కాగా మృతురాలు కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధపడుతోంది. తరచూ ఇంజక్షన్లు  చేయించుకుంటోంది.దీనిలో భాగంగానే స్నేహితురాలితోకలసి గొడిచర్ల వచ్చి అక్కడ ఇంజక్షన్‌ చేయమని కోరిందని, ముందు నిరాకరించిన ట్యాబ్‌టెక్నీషియన్‌ రూప తర్వాత చేసిందని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో డాక్టర్‌ అందుబాటులో ఉన్న సమయంలో హృద్రోగంతో బాధపడుతున్న  రోగికి  ఆయన అనుమతి తీసుకోకుండా ఇంజక్షన్‌ చేయడం నేరమని తెలుస్తోంది.    నక్కపల్లి సీఐ సీహెచ్‌ రుద్రశేఖర్‌ పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేపట్టారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.   

మరిన్ని వార్తలు