రాఖీ కట్టేందుకు వచ్చి...

26 Aug, 2019 10:23 IST|Sakshi
అన్నకు రాఖీ కడుతున్న పార్వతి (ఫైల్‌)

డెంగీ లక్షణాలతో సోదరి మృతి

సాలూరు సీహెచ్‌సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులు

విజయనగరం కేంద్రాస్పత్రికి  రిఫర్‌ చేసిన వైద్యులు

భయాందోళనలో ప్రజలు

సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి  జిల్లా ముఖీగుండికు చెందిన  సిల్‌ పార్వతి (32) తన అన్న  గణేష్‌కు రాఖీ కట్టేందుకు సాలూరు  పట్టణంలోని  బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్‌ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్‌ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు.

బిడ్డకు సైతం..
మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్‌ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆరు డెంగీ అనుమానిత కేసులు..
ఈ క్రమంలో సాలూరు సీహెచ్‌సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్‌ చేసినట్లు వైద్యాధికారి దిలీప్‌కుమార్‌ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్‌.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు  మండలాలకు  చెందిన   జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో  ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు