మహిళపై అత్యాచారం.. ఆపై హత్య

18 Jan, 2018 06:13 IST|Sakshi

పాతమాగులూరు బొద్దుల వాగు బావిలో మృతదేహం

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నాగేశ్వరరావు 

 ఆధారాలు సేకరించి నిందితుడిని గుర్తించిన డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ 

ప్రకాశం జిల్లా / పాతమాగులూరు(సంతమాగులూరు): కూలి పని చేసుకునైనా కడుపు నింపుకుందామని వాచ్‌ ఉమెన్‌ ఉద్యోగం చేసుకుంటున్న మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని పాతమాగులూరు సమీపంలో బొద్దుల వాగు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ హైమరావు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ఆరేపల్లి ముప్పాళ గ్రామానికి చెందిన మంచాల కనకమ్మ (39)కు అదే గ్రామానికి చెందిన రంగారవుతో వివాహమైంది. వీరికి నరసింహారావు అనే కుమారుడు ఉన్నాడు. అతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కొన్నేళ్ల తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె పొట్ట నింపుకోవడం కోసం మూడేళ్ల కిందట సంతమాగులూరు మండలం పాత మాగులూరు వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో వాచ్‌ ఉమెన్‌గా చేరింది. ఈ క్రమంలో సంవత్సరం కిందట పాతమాగులూరు సమీపంలోని వైష్ణవి గ్రానైట్‌ ఫ్యాక్టరీలో వాచ్‌ ఉమెన్‌గా కుదరి అక్కడ యాజమాన్యం ఇచ్చిన రూమ్‌లోనే నివశిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె బొద్దుల వాగు భావిలో శవమై తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

నిందితుడి గుర్తింపు
సంఘటన స్థలంలో చెప్పులు, కండువ, బెల్డు, కాస్త దూరంలో ఓ చొక్కా లభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఒంగోలు నుంచి డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. డాగ్‌లు అక్కడున్న వస్తువులు వాసన చూసి కొద్ది దూరంలో శ్రీ లక్ష్మీ బాలాజీ గ్రానైట్‌లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నుదుల్‌ అనే యువకుడు నివశించే స్థలాన్ని చూపించాయి. ఈ ఘాతుకానికి అతనే పాల్పడి ఉంటాడని పోలీసులు గుర్తించారు. అదే రూమ్‌లోని నిందితుని స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం మార్టూరు పరిసరాల్లో ఉండి ఉండొచ్చని  పోలీసులు విచారణలో వెల్లడించారు. ఘాతుకానికి ఒక్కడే పాల్పడ్డాడా, లేక మరికొంతమంది ఉన్నారా.. అనేది పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడి కావాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు