ఆమదాలవలసలో మహిళ హత్య

10 Feb, 2015 03:09 IST|Sakshi
ఆమదాలవలసలో మహిళ హత్య

 ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని 13వవార్డు కొత్తకోటవారి వీధికి చెందిన అన్నపూర్ణసాహు (55) అనే మహిళ సోమవారం తెల్లవారు హత్యకు గురయ్యారు. బంగారం కోసమే ఆమెను దుండగలు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటలో దుండగలు నెట్టేయడంతో ఆమె చనిపోయి ఉంటారని చెబుతున్నారు.  కానీ మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. సాహు ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెను సోమవారం తెల్లవారు కొంతమంది దుండగులు హతమార్చి ఇంట్లోని 5 తులాల బంగారంతో పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇంటి మేడపై అద్దెకు నివాసముంటున్న ఓ మహిళ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
 
 సాహుకు ఒక కుమార్తె. అన్నపూర్ణ భర్త రఘునాథ్ చాన్నాళ్ల క్రితం చనిపోయారు. ఈమే పిల్లలను పెంచి పెద్దచేసింది. కుమారుడు ఓ ఘటనలో 5 ఏళ్లక్రితం మృతి చెందాడు. కుమార్తె మానసకుమారికు వివాహం చేయడంతో ఆమె ఇచ్ఛాపురంలో ఉంటోంది. సాహు హత్యతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  జాడ పట్టలేని డాగ్‌స్కాడ్: శ్రీకాకుళం డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. క్లూస్‌టీం ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది. డాగ్‌స్క్వాడ్ ఆ ఇంటి ఎదురుగా ఉన్న సందులోంచి పరుగులు పెడుతూ కొత్తకోటవారివీధి చివర ప్రధాన రహదారిపైకి వచ్చింది.
 
 అక్కడ నుంచి డాగ్ హంతుకు జాడ తెలియకపోవడంతో వెనుదిరిగింది. అప్పటికే రోడ్లపై జనసంచారం ఎక్కువగా ఉండడంతో హంతకులు వెళ్లే జాడ కనిపెట్టలేక పోయిందని డాగ్‌స్క్వాడ్ సిబ్బంది చెప్పారు. హత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకుంటామని సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేశారు.  ప్రజల్లో ఆందోళన: పట్టణ నడిబొడ్డున జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఓ మహిళ హత్యకు గురికావడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురౌతున్నారు.  రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్రమత్తం అయి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు